BJP | ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో దాదాపు 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ పార్టీ అధికారం చేపట్టింది. అయితే, విజయం కోసం కమలం పార్టీ భారీగానే ఖర్చు చేసింది.
ఎన్నికల కమిషన్‌కు పార్టీలు సమర్పించిన వ్యయ నివేదికల ప్రకారం.. ఈ ఎన్నికల కోసం బీజేపీ రూ.57.6 కోట్ల మేర వెచ్చించింది. ఇక హస్తం పార్టీ రూ.46.2 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ రూ.14.5 కోట్లు ఖర్చు చేశాయి. అదే సమయంలో పార్టీలకు అందిన విరాళాల వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఎన్నికల సమయంలో బీజేపీకి మొత్తం రూ.88.7 కోట్లు విరాళాల రూపంలో అందగా.. కాంగ్రెస్‌కు రూ.67.1 కోట్లు, ఆప్‌కు రూ.16.1 కోట్లు సమకూరాయి.
మొత్తం విరాళంలో బీజేపీ సాధారణ ప్రచార కార్యక్రమాల కోసం రూ.39.1 కోట్లు ఖర్చు చేసింది. ఇక అభ్యర్థుల కోసం రూ.18.5 కోట్లు వెచ్చించించినట్లు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వ్యయ నివేదికలో వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ సాధారణ ప్రచారానికి రూ.12.1 కోట్లు, అభ్యర్థులకు రూ. 2.4 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సాధారణ పార్టీ ప్రచారానికి రూ.40.1 కోట్లు వెచ్చించగా.. పార్టీ అభ్యర్థుల కోసం మరో రూ.6.06 కోట్ల మేర ఖర్చు చేసినట్లు ఈసీకి సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 సీట్లు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా స్పష్టమైన ఆధిక్యం నెలకొల్పింది. ఇక గతంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆప్ ముఖ్య నేతలను సైతం బీజేపీ అభ్యర్థులు చిత్తుచిత్తుగా ఓడించారు. న్యూ ఢిల్లీలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్ తదితర కీలక నేతలు ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా ఖాతా తెరవలేకపోవడం గమనార్హం.
Also Read..
Helicopter FAL | దేశంలోనే తొలి హెలికాప్టర్ తయారీ కేంద్రం.. ఎక్కడంటే..!
Indore couple | హనీమూన్ కోసం వెళ్లి.. దట్టమైన అడవుల్లో అదృశ్యమయ్యారు..
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ లోగో రూపకర్తలు వీరే..