Helicopter FAL | దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. యూరప్‌కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్ (Airbus), టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (TASL) లు సంయుక్తంగా కర్ణాటక (Karnataka) లోని కోలారు జిల్లా (Kolar district) లో హెచ్ 125 తేలికపాటి హెలికాప్టర్ల (Helicopters) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. తొలుత 10 యూనిట్లు, ఆ తర్వాత 20 ఏళ్లలో క్రమంగా 500 యూనిట్ల వరకు హెలికాప్టర్లను తయారు చేసేలా ఈ కేంద్రాన్ని విస్తరించనున్నారు.
కోలారులోని వేమగల్ పారిశ్రామిక వాడలో ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో హెలికాప్టర్ల తయారీకి స్వదేశీ సాంకేతికతను ఉపయోగించనున్నారు. ఇలా తయారు చేసిన హెలికాప్టర్లను దేశీయ అవసరాలకు, భారతీయ సైన్యానికి, ఇతర దేశాలకు సరఫరా చేయనున్నారు. ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత హెచ్ 125 హెలికాప్టర్ల తయారీ యూనిట్‌ను స్థాపిస్తున్న నాలుగో దేశంగా భారత్ నిలువనుంది.
హెలికాప్టర్ల తయారీ, నిర్వహణ, మరమ్మతు తదితర కార్యకలాపాల కోసం 7.40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ఒప్పంద కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ విండోను ఏర్పాటు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ ప్రకటించింది.