ఢాకా, ఫిబ్రవరి 14: తమ దేశ పౌరుల ప్రయోజనాలే తమ తొలి ప్రాధాన్యం అని బీఎన్పీ చీఫ్, బంగ్లాదేశ్ కాబోయే ప్రధాని తారిఖ్ రెహ్మాన్ శనివారం స్పష్టం చేశారు. భారత దేశంలో సంబంధాలు సహా ‘ప్రజలే ముందు’ అనే సూత్రం ద్వారా తమ విదేశాంగ విధానం మార్గదర్శనం చేస్తుందని అన్నారు. పార్లమెంట్‌కు జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం అనంతరం తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మొదట మా దేశ ప్రయోజనాలే ముఖ్యం. అవే మా విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయి’ అని అన్నారు. ఈ సందర్భంగా జాతి అంతా ఐక్యంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం కోసం త్యాగం చేసిన వారికి తన విజయం అంకితమని ఆయన ప్రకటించారు. ‘సురక్షితమైన మానవీయ బంగ్లాదేశ్ నిర్మాణం కోసం మేం అందరి సహకారం కోరుతున్నాం. జాతి పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం అందరి బాధ్యత’ అని ఆయన అన్నారు.
తారిఖ్ రహ్మాన్ ప్రమాణానికి మోదీ?
బంగ్లా ప్రధానిగా తారిఖ్ రహ్మాన్ ఈ నెల 16 లేదా 17ప్రమాణం చేయనున్నట్లు ఓ అధికారి డైలీ స్టార్ పత్రికకు వెల్లడించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి మన ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని బీఎన్పీ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.