ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్..పొట్టి ప్రపంచకప్ప్లో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. కొలంబో వేదికగా ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. మెగాటోర్నీలో తమ ఘనమైన విజయ ప్రస్థానాన్ని కొనసాగించేందుకు టీమ్ఇండియా కదన కుతుహలంతో ఉంటే…గత చరిత్రను తిరుగరాసేందుకు పాక్ పట్టుదలతో ఉంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఒడిసిపట్టుకునేందుకు సూర్యకుమార్‌సేన సమరశంఖం పూరిస్తుంటే..తటస్థ వేదికపై తమ సత్తాచాటేందుకు పాక్ ప్రయత్నంలో ఉంది.
ప్రపంచంలోని రెండు మేటి జట్ల మధ్య పోరు అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తుండగా, మ్యాచ్‌కు వరుణుడి ఆటంకమన్న వార్తలు ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. డాషింగ్ ఓపెనర్ అభిషేక్‌శర్మ రీఎంట్రీ దాదాపు ఖాయం కాగా, తుది జట్టు కూర్పుపై అమితాసక్తి నెలకొన్నది. ప్రేమదాస పిచ్‌కు అనుగుణంగా ముగ్గురు స్పిన్నర్లతో పాక్‌ను కట్టడి చేసేందుకు టీమ్ఇండియా లెక్కలు వేస్తుంటే.. దీటుగా స్పందించేందుకు దాయాది పావులు కదుపుతున్నది. శివరాత్రి శుభవేళ క్రికెట్ అభిమానులకు భారత్, పాక్ పోరు పసందైన విందు అందించడం ఖాయంగా కనిపిస్తుంది.
కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ పోరుపై కమ్ముకున్న నీలిమేఘాలు చెదిరిపోయాయి. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ చిరకాల ప్రత్యర్థులు సమరానికి సిద్ధమయ్యాయి. ఆదివారం కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరుగనుంది. మెగాటోర్నీలో ఇప్పటికే చెరో రెండు విజయాలు సాధించి గ్రూపు-ఏలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలువడం ద్వారా సూపర్-8 బెర్తులు ఖరారు కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది.
టీ20 ప్రపంచకప్‌లో ఓసారి ముఖాముఖి పోరును పరిశీలిస్తే భారత్, పాక్ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు తలపడగా, ఏడు సార్లు టీమ్ఇండియా గెలిస్తే..ఒకసారి పాక్ విజయం వైపు నిలిచింది. తమ అసమాన రికార్డును కొనసాగించేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా మెండైన ఆత్మవిశ్వాసంతో ఉంటే..గత పరాభవాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ కసి మీదుంది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఘటనలు జరుగుతున్న క్రమంలో మ్యాచ్‌ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశముంది. మ్యాచ్‌ను మ్యాచ్ గాకుండా తమ దేశ ప్రతిష్టగా భావించనున్నాయి.
టీమ్ఇండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్‌శర్మ..పాక్‌తో పోరులో ఆడటం ఖాయంగా కనిపిస్తున్నది. కడుపులో నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన అభిషేక్..శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. షాహిన్ షా ఆఫ్రిదీ, నసీమ్ షా లాంటి పేసర్లను దీటుగా ఎదుర్కొనేందుకు అభిషేక్ లాంటి హార్డ్‌హిట్టర్ టీమ్ఇండియాకు కచ్చితంగా కావాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీనికి తోడు ఈ పంజాబీ బ్యాటర్ సూపర్ఫామ్మీదుండటం మనకు కలిసి రానుంది. ఆదిలోనే పాక్ బౌలర్ల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీస్తూ అభిషేక్ బ్యాటు ఝులిపిస్తే టీమ్ఇండియా భారీ స్కోరుకు బాటలు పడ్టట్లే. మరో ఎండ్‌లో ఇషాన్‌కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటం లాభించనుంది. అభిషేక్, కిషన్ విజృంభిస్తే పాక్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. అభిషేక్‌కు బెర్తు ఖాయమైతే..శాంసన్ తన స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది.
ప్రేమదాస పిచ్ పరిస్థితుల దృష్ట్యా పాక్‌తో పోరులో టీమ్ఇండియా ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్‌పటేల్‌తో బరిలోకి దిగాలన్న ఆలోచనతో ఉంది. పాక్ బ్యాటర్లకు కళ్లెం వేసేందుకు ముగ్గురు స్పిన్నర్ల అస్ర్తాన్ని టీమ్ఇండియా ప్రయోగించే అవకాశముంది. ఇదే జరిగితే స్పెషలిస్టు బ్యాటర్ రింకూసింగ్ తన స్థానాన్ని వదులుకోక తప్పదు. ఒకవేళ అర్ష్‌దీప్‌సింగ్‌ను పక్కకుపెట్టి బుమ్రా, హార్దిక్‌పాండ్యా, శివమ్ దూబేతో పేస్ దళాన్ని నడిపించి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. మొత్తంగా తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొన్నది.
మెగాటోర్నీలో అమెరికా, నమీబియాతో మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా మిడిలార్డర్ ఘోరంగా తడబడింది. టాపార్డర్‌లో ఇషాన్‌కిషన్, తిలక్, సూర్యకుమార్ రాణిస్తున్నా..మిడిల్లో శివమ్, హార్దిక్, రింకూ, అక్షర్ అంచనాలు అందుకోలేకపోతున్నారు. అమెరికాతో పోరులో 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో సూర్యకుమార్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టు పోరాడే స్కోరు అందుకుంది. నమీబియాతో పోరులోనూ కిషన్ ఇచ్చిన మెరుగైన ఆరంభాన్ని కొనసాగించడం విఫలమైంది. మిడిల్లో హార్దిక్, శివమ్ ఆకట్టుకోవడంతో రెండు వందల మార్క్ అందుకుంది. పాక్‌తో పోరులోనూ ఇలాగే తడబడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
పాక్ సమష్టిగా రాణించేందుకు తహతహలాడుతున్నది. ఓపెనర్ ఫర్హాన్ మంచి ఫామ్మీదుండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది. ముఖ్యంగా బుమ్రాపై ఫర్హాన్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఫర్హాన్‌కు తోడు బాబర్ ఆజమ్, కెప్టెన్ సల్మాన్, సయిమ్ ఆయూబ్ నిలదొక్కుకుంటే భారత్ చెమటోడ్చాల్సి వస్తుంది. ఆఫ్రిది, నసీమ్షా పేస్ దాడికి తోడు వైవిధ్యమైన స్పిన్‌తో వార్తల్లో నానుతున్న ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కొవడం టీమ్ఇండియాకు అంత ఈజీ కాకపోవచ్చు. ఆగుతూ బౌలింగ్ చేస్తున్న ఉస్మాన్‌ను నిలువరిస్తే భారత్ అడ్డంకిని అధిగమించినట్లే.
ఇదిలా ఉంటే ఆదివారం మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కల్గించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అభిమానుల ఆశలపై నీళ్లు గుమ్మరించినట్లే. ఆస్ట్రేలియా, జింబాబ్వే మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌నే ఈ మ్యాచ్‌కు వాడనున్నారు. పిచ్‌పై గడ్డి కొద్దిగా ఉండటంతో పేసర్లకు అనుకూలించే అవకాశముంది.
7-1: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ గెలుపు, ఓటముల రికార్డు.
భారత్: కిషన్, అభిషేక్, తిలక్, సూర్యకుమార్(కెప్టెన్), హార్దిక్, శివమ్‌దూబే, రింకూసింగ్, అక్షర్‌పటేల్, కుల్దీప్యాదవ్, వరుణ్, బుమ్రా
పాకిస్థాన్: ఫర్హాన్, ఆయూబ్, సల్మాన్ ఆగా(కెప్టెన్), బాబర్ ఆజమ్, షాదాబ్, ఉస్మాన్/ ఫకర్ జమాన్, నవాజ్, ఫహీమ్ అష్రఫ్, ఆఫ్రిది, ఉస్మాన్ తారిఖ్, అబ్రార్ అహ్మద్