హైదరాబాద్/ముంబై, ఫిబ్రవరి 14: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు పరుగులు పెడుతుండటం, అమెరికా నిరుద్యోగ గణాంకాలు మెరుగుపడటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పుంజుకుంటున్నాయి. వీటికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర రూ.1,970 ఎగబాకి రూ.1,57,750కి చేరుకున్నది. అలాగే 22 క్యారెట్ ధర రూ.1,800 అందుకొని రూ.1,44,600కి ఎగబాకింది. కిలో వెండి రూ.2.80 లక్షల వద్ద స్థిరంగా ఉన్నది. శుక్రవారం కిలో ధర రూ.22 వేలు తగ్గిన విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 97.90 డాలర్లు ఎగబాకి 5,046.30 డాలర్లకు చేరుకున్నది. అలాగే వెండి 2.28 డాలర్లు లేదా 3 శాతం అందుకొని 77.96 డాలర్లు పలికింది.
బంగారం ఒక పెట్టుబడి సాధనంగా మారుతున్నది. ముఖ్యంగా యువతకు అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా సాధానంగా తయారవుతున్నది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది యువత బంగారానికి ఓటు వేశారు. గతంలో ఈక్విటీలు, భూములు, ఇతర వాటికి మొగ్గుచూపిన యువత..ఈసారి తన పంతాను మార్చుకొని స్వర్ణానికి మొగ్గుచూపారు. దేశవ్యాప్తంగా పల్స్ఏఐ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది గోల్డ్ తమ మొదటి ప్రాధాన్యత అని నినదించారు. బంగారం కొనుగోళ్లు తమ వ్యక్తిగత అవసరాల నిమిత్తం కొనుగోలు చేస్తున్నట్టు 66.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే 62 శాతం మంది యువత 5 గ్రాముల కంటే తక్కువగా కొనుగోలు చేశారట.
గతంలో వయస్సు పైబడిన వారు మాత్రమే గోల్డ్‌ను కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఈ ట్రెండ్ మారిందని, 18 ఏండ్ల నుంచి 39 ఏండ్ల లోపు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 5 వేల మంది పాల్గొన్నారు. తమ వద్ద రూ.25 వేల వరకు ఉంటే వెంటనే గోల్డ్‌ను కొనుగోలు చేస్తామని 61.9 శాతం మంది చెప్పారు. అలాగే 16. 6 శాతం మంది మ్యూచువల్ ఫండ్లలో, 13 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్లలో, 6.6 శాతం మంది స్టాక్స్‌లలో, క్రిప్టోల్లో 1.9 శాతం మంది ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు.
ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తలెత్తితే బంగారం అత్యంత సురక్షితమైనదిగా 65.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. బ్యాంక్ పొదుపు, ఫండ్స్ లేదా ఈక్విటీల కంటే ఇదే సురక్షితమైనదని చెప్పారు. 61.9 శాతం మంది 5 గ్రాముల లోపు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపగా, 27.5 శాతం మంది రెండు గ్రాముల కంటే తక్కువగా, 34.4 శాతం మంది 2 గ్రాముల నుంచి 5 గ్రాముల లోపు కొనుగోలు చేస్తామని చెప్పారు. 24 శాతం మంది తమ మొదటి సంపాదన లేదా వ్యక్తిగత ఆదాయంతో మొదటి సారి గోల్డ్ కొనుగోలు చేస్తామని చెప్పగా, 23.9 శాతం మంది పెట్టుబడుల కోసమన్నారు.