– ఫుట్ పాత్ లు పాదచారుల కోసమే
– ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
– కమిషనర్ వంశీకృష్ణ
నీలగిరి, ఆగష్టు 01: నల్లగొండ నగరంలోని దేవరకొండ రోడ్డులో పుట్‌పాత్ ఆక్రమించి నిర్మాణం చేసుకున్న అక్రమ నిర్మాణాలను శనివారం మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తొలగించారు. ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించడం, పాదచారులకు సురక్షితమైన రాకపోకలు కల్పించడం, ప్రజా రహదారులను ఆక్రమణల నుంచి విముక్తం చేయడం లక్ష్యంగా డీఈఓ కార్యాలయం నుండి దుప్పలపల్లి రోడ్డు వరకు ప్రధాన రహదారిపై నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రహదారులు, కూడళ్లు మరియు ఫుట్ పాత్ లపై ఏర్పాటు చేసిన సుమారు 43 అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు మూడు ప్రధాన జంక్షన్లను పూర్తిగా తొలగించి ప్రజల రాకపోకలకు అనువుగా మార్చారు. షెడ్లు, సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు, డబ్బా బంకులు, ప్రకటన బోర్డులు, వస్తువుల ప్రదర్శనలు, ఇతర తాత్కాలిక నిర్మాణాలను ఫుట్ పాత్ లు లేదా రహదారులపై ఏర్పాటు చేయరాదని మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ వంశీకృష్ణ హెచ్చరించారు.
ఫుట్ పాత్ లు పూర్తిగా పాదచారుల వినియోగం కోసమే అని, వాటిపై ఎటువంటి ఆక్రమణలు ఉండకూడదని పేర్కొన్నారు. ఫుట్ పాత్ లు ఆక్రమించబడటంతో ప్రజలు రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం మరియు నగర క్రమబద్ధీకరణ దృష్ట్యా ఇటువంటి ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నగర ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రమైన, క్రమబద్ధమైన, సురక్షితమైన రహదారులు మరియు ఫుట్‌పాత్‌లను అందుబాటులో ఉంచేందుకు ఇటువంటి ప్రత్యేక డ్రైవ్ లు నగరంలోని అన్ని ప్రధాన రహదారులు, కూడళ్లు మరియు రద్దీ ప్రాంతాల్లో నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు, వ్యాపారులు మున్సిపల్ కార్పొరేషన్‌కు సహకరించి ప్రజా స్థలాలను ఆక్రమణల రహితంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ గడ్డం శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ నంద్యాల ప్రదీప్డ్డి, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ జవాన్లు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

నల్లగొండలో భారీ ఎత్తున అక్రమ నిర్మాణాల తొలగింపు