– పోగొట్టుకున్న ఫోన్, నగదు పోలీసుల సమక్షంలో బాధితుడికి అప్పగింత
జూలూరుపాడు, ఆగస్టు 01 : నేటి సమాజంలో స్వార్థం పెరిగిపోతున్నా ఇంకా మంచితనం, నిజాయితీ సజీవంగా ఉన్నాయని నిరూపించాడు జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చెంగల నాగేశ్. వివరాల్లోకి వెళితే.. నాగేష్ కాకర్ల నుండి గుండెపుడి మీదుగా ఆటోలో జూలూరుపాడు వస్తుండగా ముత్యాలమ్మ గుడి సమీపంలో రోడ్డుపై పడి ఉన్న ఒక సెల్ ఫోన్ ను గమనించాడు. ఫోన్ ను పరిశీలించగా దాని పౌచ్ లో రూ.1,500 నగదు ఉన్నట్టు గుర్తించాడు. ఏమాత్రం ఆశపడకుండా తన ప్రయాణాన్ని పోలీస్ స్టేషన్ వైపు మళ్లించి వెంటనే జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వరరావుకు ఫోన్ ను, నగదును అప్పగించాడు.
పోగొట్టుకున్న బాధితుడికి ఈ సొత్తును అందజేయాలని నాగేష్ కోరగా, పోలీస్ సిబ్బంది విచారణ చేపట్టి ఆ ఫోన్ వెంగన్నపాలెం గ్రామానికి చెందిన దుద్దుకూరు నాగేశ్వరరావు ఫోన్ గా గుర్తించారు. వెంటనే బాధితుడికి సమాచారం అందించి పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు, ఇతర పోలీస్ సిబ్బంది సమక్షంలో ఆటో డ్రైవర్ చెంగల నాగేష్ చేతుల మీదుగా ఫోన్ ను, నగదును దుద్దుకూరు నాగేశ్వరరావుకు అందజేశారు. ఆటో నడుపుకుంటూ కష్టపడి జీవించే నాగేష్ చూపిన ఈ నిజాయితీ, మానవతా దృక్పథాన్ని హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు అభినందించారు.