Indore couple | వారిద్దరూ నూతన వధూవరులు.. హనీమూన్ కోసం వెళ్లి దట్టమైన అడవుల్లో అదృశ్యమయ్యారు. నవ దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి మే 11వ తేదీన సోనమ్ అనే యువతితో వివాహమైంది. హనీమూన్ కోసం మే 20న తమ ఇంటి నుంచి బయల్దేరారు. అసోం రాజధాని గువహటి మీదుగా షిల్లాంగ్ వెళ్లారు. షిల్లాంగ్ వెళ్లే ముందు గువహటిలో కామాఖ్యా అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ జంట గువహటి మీదుగా షిల్లాంగ్‌కు ప్రయాణించి, దాదాపు 60 కి.మీ దూరంలో ఉన్న సోహ్రా (చిరాపుంజి) సందర్శించడానికి యాక్టివాను అద్దెకు తీసుకున్నారు. దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ వారు ముందుకు సాగారు. మరుసటి రోజు సోహ్రారిమ్ అనే గ్రామ సమీపంలో నవ దంపతుల యాక్టివా పడి ఉంది. కానీ ఆ దంపతులు కనిపించకుండా పోయారు. మేఘాలయాలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రెండు జంటలు అదృశ్యమయ్యాయి.
రాజా, సోనమ్ అదృశ్యంపై అతని తల్లి రీనా స్పందించారు. తమతో చివరిసారిగా మే 23వ తేదీన మాట్లాడినట్లు తెలిపారు. ఇక అప్పట్నుంచి వారితో మాట్లాడలేదని, కమ్యూనికేషన్ లేకుండా పోయిందని విలపించారు. మే 24వ తేదీ వరకు కూడా వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌గా ఉన్నాయి. దీంతో ఆందోళనకు గురై మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు, బంధువులు కలిసి సోహ్రా ప్రాంతంలో గాలిస్తున్నారు.
అయితే ఈ అడవుల్లో చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో.. అంతే ప్రమాదకరంగా ఉంటాయని పోలీసులు తెలిపారు. దట్టంగా చెట్లు, లోతైన లోయలు ఉండడంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయన్నారు. ఓస్రా హిల్‌లో ఆ జంట చివరి లోకేషన్ చూపించబడింది. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం అని పోలీసులు తెలిపారు. ఇక్కడ ఉండే ఓ రిసార్ట్‌కు నేర చరిత్ర ఉందని, దాని సిబ్బందిని విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. హనీమూన్ కోసం వచ్చిన జంట ఈ రిసార్ట్‌లో సేద తీరుతారా..? లేదా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ జంట అద్దెకు తీసుకున్న యాక్టివా నంబర్ ఆధారంగా.. దాని యజమానిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.