పాట్నా: ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్‌కు (Prashant Kishor) చెందిన జన్ సురాజ్ నిధుల గురించి బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ప్రశ్నించారు. షెల్ కంపెనీల ద్వారా ఆయన కోట్లు సేకరించారని ఆరోపించారు. ‘నష్టాల్లో నడుస్తున్న కంపెనీలు ప్రశాంత్ కిషోర్‌కు మాత్రమే కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తాయి? కాంగ్రెస్ పాలనలో (కేంద్రంలో) ప్రతి గ్రామస్తుడికి ‘స్కామ్’ అనే పదం తెలిసినట్లే, ప్రశాంత్ కిషోర్ ద్వారా రౌండ్-ట్రిప్పింగ్ అంటే ఏమిటో అందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.
కాగా, ప్రశాంత్ కిషోర్ దీనిపై స్పందించారు. పార్టీ నిధులు పారదర్శకంగా, క్లీన్‌గా ఉన్నాయని తెలిపారు. పలు సంస్థలకు తాను కన్సల్టెంట్‌గా పనిచేసి మూడేళ్లలో రూ. 241 కోట్లు సంపాదించినట్లు తెలిపారు. ‘నేను రూ.31 కోట్లు జీఎస్టీగా, రూ.20 కోట్లు ఆదాయపు పన్నుగా చెల్లించా. రూ. 98 కోట్లు చెక్ చెల్లింపు ద్వారా జన్ సురాజ్‌కు విరాళంగా ఇచ్చా’ అని అన్నారు. పార్టీ ఖాతాలకు చెల్లింపులన్నీ చెక్కుల ద్వారా జరిగాయని తెలిపారు. ఇతర వనరుల నుంచి కూడా విరాళాలు అందినట్లు చెప్పారు. నిధుల సేకరణలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని అన్నారు.
మరోవైపు సొంత రాష్ట్రమైన బీహార్‌ను మార్చాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ‘నేను డబ్బు సంపాదించడానికి బీహార్ రాలేదు. నా దగ్గర ఉన్న ప్రతి రూపాయి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నది. ఈ వ్యవస్థ మారే వరకు పదేళ్ల పాటు నేను బీహార్లోనే ఉంటా’ అని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు.
Also Read:
Woman Thrashes Children | చికెన్ కావాలని అడిగిన పిల్లలు.. చపాతీ కర్రతో కొట్టిన తల్లి, కొడుకు మృతి
Watch: హుక్ తెగి పక్కకు ఒరిగిన జైంట్ వీల్, గాలిలో రైడర్స్.. తర్వాత ఏం జరిగిందంటే?