న్యూఢిల్లీ: రోడ్డుపక్కన తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న పసిబాబును కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి అమ్మేశారు. (Toddler kidnapped and Sold) ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. మైనర్ బాలుడితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రాజస్థాన్‌కు చెందిన ముఖేష్, చేతితో తయారు చేసే వస్తువులు అమ్మి జీవిస్తున్నాడు. సెప్టెంబర్ 24న రాత్రివేళ పూసా రోడ్ వద్ద ఉన్న ఫుట్‌పాత్‌పై అతడి కుటుంబం నిద్రించింది.
కాగా, తల్లి పక్కన నిద్రించిన 18 నెలల బాలుడు అదృశ్యమయ్యాడు. కుమారుడు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ముఖేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో పరిసర ప్రాంతాల్లోని వందకుపైగా సీసీటీవీ పుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ పసివాడ్ని కిడ్నాప్ చేయడాన్ని గమనించారు. ఆసుపత్రి వద్ద కారులో ఉన్నవారికి ఆ బాబును ఇచ్చినట్లు తెలుసుకున్నారు.
మరోవైపు ఆ కారును ట్రేస్ చేసిన ఢిల్లీ పోలీసులు కాళీ బారి లేన్‌లో నివసించే నిందితులను గుర్తించారు. 22 ఏళ్ల అనంత్, 24 ఏళ్ల రాజు అలియాస్ రిషి, 21 ఏళ్ల సాహిల్ కుమార్‌తో పాటు 17 ఏళ్ల యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా ఉత్తరప్రదేశ్‌లోని మహోబాకు చెందిన 54 ఏళ్ల ఫూలన్ శ్రీవాస్ అలియాస్ సంతోష్‌కు రూ.45,000కు ఆ బాలుడ్ని అమ్మినట్లు వారు చెప్పారు.
కాగా, ఆ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న పసి బాలుడ్ని స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ చిన్నారి కిడ్నాప్ కోసం వినియోగించిన స్కూటర్, కారుతో పాటు రూ.5,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇద్దరు కుమార్తెల తండ్రి అయిన శ్రీవాస్ మగ పిల్లవాడు కావాలనుకున్నాడని, దీని కోసం ఈ గ్యాంగ్‌కు డబ్బులు ఆఫర్ చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Woman Thrashes Children | చికెన్ కావాలని అడిగిన పిల్లలు.. చపాతీ కర్రతో కొట్టిన తల్లి, కొడుకు మృతి
Sonam Raghuvanshi | దసరా రోజున.. సోనమ్ దిష్టిబొమ్మ దహనాన్ని నిషేధించిన కోర్టు
Watch: హుక్ తెగి పక్కకు ఒరిగిన జైంట్ వీల్, గాలిలో రైడర్స్.. తర్వాత ఏం జరిగిందంటే?