ఇంఫాల్: మణిపూర్ మాజీ సీఎం ఎన్ బీరేన్ సింగ్ (Biren Singh) నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో ప్రభుత్వం పునరుద్ధరణ కోసం ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు హెచ్ డింగో, త్ రాబిన్ద్రో, ఎస్ రంజన్, మాజీ మంత్రి గోవిందాస్ కొంథోజామ్, హిల్ ఏరియాస్ కమిటీ చైర్మన్ డింగాంగ్లంగ్ గంగ్మేయ్ ఈ బృందంలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోసం వారు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రధాని బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఆయనను వారు కలుస్తారా లేదా అన్నది అనిశ్చిత్తిగా ఉన్నది.
కాగా, బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలవడం, మణిపూర్‌లో కొత్త ప్రభుత్వాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేయడం లక్ష్యంగా తాము ఢిల్లీకి చేరినట్లు బీరేన్ సింగ్ తెలిపారు. రెండేళ్లుగా జాతి హింసతో ఆ రాష్ట్రం రగిలిన నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది.
మరోవైపు ఆగస్ట్‌లో పార్లమెంటు ఆమోదంతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు కేంద్రం పొడిగించింది. అయితే ఆ రాష్ట్రం కేంద్ర పాలనలో ఉన్నప్పటికీ అసెంబ్లీని రద్దు చేయలేదు. అసెంబ్లీని సస్పెన్షన్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు బీరేన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు.
Also Read: