Rahul Gandhi : బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హత్య ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. బీహార్ రాష్ట్రం దేశంలో నేరాల రాజధాని (Crime capital) గా మారిందని ఆయన మరోసారి విమర్శించారు.
ఇటీవల ప్రముఖ వ్యాపారి గోపాల్ ఖేమ్కా హత్య అనంతరం కూడా రాహుల్‌గాంధీ ఇదే వ్యాఖ్య చేశారు. ఖేమ్కాను పట్నాలో ఆయన ఇంటి దగ్గరే కాల్చిచంపారు. రెండు రోజుల క్రితం పట్నాలో ఓ బీజేపీ నేత హత్యకు గురయ్యారు. ఆదివారం దుండగులు ఓ లాయర్ కాల్చిచంపారు. ఈ క్రమంలో బీహార్ దేశ నేరాల రాజధానిగా మారిందని రాహుల్‌గాంధీ మరోసారి వ్యాఖ్యానించారు.
నిరుద్యోగ యువత హత్యలు చేస్తూ గూండాలుగా మారుతుంటే.. సీఎం నితీశ్‌కుమార్ మాత్రం తన కుర్చీని కాపాడుకునేందుకే తాపత్రయపడుతున్నారని రాహుల్‌గాంధీ విమర్శించారు. బీజేపీ మంత్రులు కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఈసారి బీహార్ ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ప్రభుత్వ మార్పునకే కాకుండా.. బీహార్‌ను కాపాడేందుకు వినియోగించాలని పిలుపునిచ్చారు.
ఆదివారం పట్టపగలు ఓ లాయర్ని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు ప్రముఖ వ్యక్తులు హత్యకు గురవ్వడం రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇలాంటి వరుస ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వైఫల్యమే ఈ వరుస హత్యలకు కారణమని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇదిలావుంటే ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. అధికారాన్ని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా రానున్న ఐదేళ్లలో కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.