హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న వాయుగుండం ప్రభావంతో వచ్చే ఆరు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసినట్టు పేర్కొన్నది.
వర్షసూచన నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అకాల వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గినట్టు వివరించింది. సోమవారం సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్టు తెలిపింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వడగండ్ల వాన కురిసింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మనూరులో 2.46 సెం.మీ కురిసింది