దండేపల్లి/ఖానాపూర్, మార్చి16 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అజ్మీరా గోవింద్ నాయక్(76) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవింద్‌నాయక్ ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. గోవింద్నాయక్కు ముగ్గురు కుమారులు ఉన్నారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
గోవింద్ నాయక్ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే 1985 సంవత్సర కాలంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు.1985లో స్వతంత్ర అభ్యర్థిగా ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచి 1989 వరకు కొనసాగారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నుంచి 1994 నుంచి 1999 వరకు, టీఆర్ఎస్ నుంచి 2004 నుంచి 2008 వరకు మూడుసార్లు ఖానాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగారు. మొదటిసారిగా 1977లో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన ఇప్పటి వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. ఆయన మృతిపై బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజాప్రతినిధిగా ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అయన ప్రజాసేవా స్ఫూర్తి అందరికీ అదర్శంగా నిలుస్తుందన్నారు. గోవింద్ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి పవిత్ర అత్మకు శాంతి చేకూరాలని జాన్సన్ నాయక్ తెలిపారు.
కేసీఆర్‌తో ప్రత్యేక అనుబంధం
తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో గోవింద్నాయక్కు ప్రత్యేక అనుబంధం ఉంది. 2004లో కారు గుర్తుపై పోటీ చేసి గోవింద్ నాయక్ గెలుపొందాడు. అదే సంవత్సరం జిల్లా పర్యటనకు వచ్చిన ఉద్యమ నేత కేసీఆర్ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో గోవింద్‌నాయక్ ఉద్యమ నేతకు అండగా నిలిచాడు. 2025లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా మర్యాద పూర్వకంగా కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు.