హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రోజువారీ పాలన, హామీల అమలు కోసం ప్రజలపై అడ్డగోలుగా అప్పుల భారం మోపుతున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో భారీగా రుణాలు సమీకరించడమే పనిగా పెట్టుకున్న రేవంత్రెడ్డి సరార్ గత నెలలో బహిరంగ మార్కెట్ నుంచి ఏకంగా రూ.13,500 కోట్ల అప్పులు తెచ్చి ఆల్టైమ్ రికార్డు నెలకొల్పింది. ఇది చాలదన్నట్టు తాజాగా మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో మరో రూ.2,500 కోట్ల రుణం సమీకరించింది. ఇందులో 13 ఏండ్ల కాలపరిమితితో 7.62% వార్షిక వడ్డీకి రూ.500 కోట్లు, 18 ఏండ్ల కాలపరిమితితో 7.69% వడ్డీకి రూ.500 కోట్లు, 23 ఏండ్ల కాలపరిమితితో 7.69% వడ్డీకి రూ.500 కోట్లు, 29 ఏండ్ల కాలపరిమితితో 7.70% వడ్డీకి మరో రూ.100 కోట్లు తీసుకున్నది. దీంతో ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆర్బీఐ నుంచి సమీకరించిన మొత్తం రుణాలు రూ.34,900 కోట్లకు చేరాయి. ఇది రాష్ట్ర వార్షిక రుణ సమీకరణ లక్ష్యంలో దాదాపు 44 శాతానికి సమానం.
రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి దించుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత 5 వారాల్లోనే ఆర్బీఐ నుంచి రూ.16 వేల కోట్ల రుణాలు సమీకరించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ-2)లో రూ.21, 000 కోట్ల అప్పు కావాలని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం.. అందులో 75 శాతానికిపైగా మొత్తాన్ని ఆగస్టు మొదటి వారానికే పుచ్చుకున్నది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.54,009 కోట్ల రుణాలు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించిన రేవంత్రెడ్డి సర్కార్.. ఆ పరిమితికి మించి భారీగా అప్పు లు తెచ్చింది. బహిరంగ మారెట్ నుంచి ఏకంగా రూ.85,840 కోట్ల రుణాలు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.80 వేల కోట్ల రుణాలు సమీకరిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం నాలుగున్నర నెలలు తిరక్కుండానే రూ.34, 900 కోట్ల అప్పులు తెచ్చింది. దీంతో ఈసారి కూడా వార్షిక రుణ పరిమితికి మించి రుణాలు తేవడం ఖాయమని తెలుస్తున్నది.
ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాన్ని (ద్రవ్యలోటును) పూడ్చుకునేందుకు రేవంత్రెడ్డి సర్కార్ బహిరంగ మారెట్ రుణాలపై అమితంగా ఆధారపడుతున్నది. అధిక వడ్డీ రేట్లతో సుదీర్ఘ కాలానికి తీసుకుంటున్న ఈ రుణాలు రాష్ర్టానికి, భవిష్యత్తు తరాలకు తీవ్రమైన భారంగా పరిణమించనున్నాయి. ఉత్పత్తిరహిత ఖర్చుల కోసం, తాతాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల రాష్ట్రం త్వరలోనే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
