హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రైతులను చూస్తుంటే బాధేస్తున్నది. కాళేశ్వరం నీళ్లు ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రాబ్లం ఏంది? ఎందరో మేధావులు చెప్పినా సరే కాళేశ్వరం కూలిపోద్ది, ఊడిపోద్దు అంటున్నరు. ఒకవేళ కాంగ్రెస్ చెప్తున్నదే నిజమైతే బాగుచేసి రైతులకు నీళ్లివ్వొచ్చు కదా!’ ఇది ప్రాంతీయతను పక్కనబెట్టి ఏపీలోని విశాఖ రైతు స్పందించిన తీరు. సగటు రైతుగా తెలంగాణలో రైతాం గం పడుతున్న కష్టాలు చూడలేక తల్లడిల్లడమే గాక, ఇబ్బందులు పెడుతున్న పొ రుగు రాష్ట్ర ప్రభుత్వంపై ఓ టీవీ డిబేట్ సాక్షిగా ఆగ్రహించడం ఆలోచింపజేస్తున్నది.
రాష్ట్రంలోని రైతుల సమస్యలు, వ్యవసాయంపై ఆంధ్రా రైతుకున్న సోయి రేవంత్ సర్కార్‌కు లేకుండా పోయింది. తెలంగాణను సస్యశ్యామలంగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంపై పక్క రాష్ట్ర రైతులు తల్లడిల్లిపోతున్నారు. కానీ సొంత రాష్ట్రం పాలకులకు మాత్రం రాజకీయమే తప్ప రైతులపై కనికరం లేదు. ఈ మేరకు నీటి పారుదల, వ్యవసాయరంగంపై జీ న్యూస్ ఓ డిబేట్ నిర్వహించింది. ఇందులో పలువురు రైతుల అభిప్రాయాలను ఫోన్ ద్వారా తీసుకున్నది. ఇందులో భాగంగానే విశాఖ జిల్లా రైతు బీఎస్ నాయుడు తెలంగాణలోని రేవంత్‌రెడ్డి సర్కార్ రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తన ఆవేదనను వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను కూడా ఒక రైతునని, తెలంగాణ రైతులను చూస్తుంటే బాధేస్తున్నదని చెప్పారు.
కాళేశ్వరం కూలిపోద్ది, ఊడిపోద్ది అనడంపై మండిపడ్డారు. తెలంగాణ రాకముందు, ఉమ్మడి ఏపీలో తెలంగాణలో పంటలు, ధాన్యం ఎందుకు పండలేదని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ సర్కార్ ఇన్ని విషయాలు చెబుతుంది కదా.. మరి కేసీఆర్ రాకముందు తెలంగాణలో ఇన్ని పంటలు ఎందుకు పండలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతే ఎందుకు అంత పంటలు పండుతున్నాయి. అంతకుముందు ఆం ధ్రా నుంచి తెలంగాణకు ధాన్యం వచ్చేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారింది. ఇదెలా సాధ్యమైంది?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ రైతుల గురించి ఆలోచించాలని హితవు పలికారు. మేధావులంతా కలిసైనా రేవంత్‌రెడ్డి సర్కార్‌కు చెప్పాలని సూచించారు.