హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఉచితంగా పైలట్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు మంగళవారం ఇంటర్ విద్యాశాఖ, ఇండిగో అనుబంధ సంస్థ ఇండిగోరీచ్ మధ్య ఎంవోయూ కుదిరింది. అర్హత గల అమ్మాయిలకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) శిక్షణతో పాటు ఏటీఆర్ టైప్ రేటింగ్ కూడా పూర్తిస్థాయిలో అందించనున్నారు.
ఎంపికైన వారికి 20 నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఉచిత వసతి, భోజనం, వైద్య బీమా, మెంటార్ షిప్, కెరీర్ మార్గదర్శకత్వ అందిస్తారు. ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభినవ్ మాట్లాడుతూ ఆసక్తి గల వారు indigoreachgwf.scholarsbox.in లింక్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ యెంక్యానాయక్, ఎస్ఐవీఈ ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోత్స్నారాణి, భారత్ కేర్స్ ప్రతినిధి సీ సాయి తదితరులు పాల్గొన్నారు.