హైదరాబాద్,ఆగస్టు 4, (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జనన, మరణాల నమోదు సవరణ బిల్లు-2026’కు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బిల్లుపై మంగళవారం పార్లమెంట్లో జరిగిన చర్చలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. జనన ధ్రువీకరణ పత్రం కేవలం కాగితం కాదని, అది ప్రతి పౌరుడికీ లభించే మొదటి చట్టబద్ధమైన గుర్తింపు అని వద్దిరాజు పేర్కొన్నారు. నకిలీ గుర్తింపులు, అక్రమ ఆస్తి హకుల వాదనలను అరికట్టేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కఠినమైన నిబంధనలు మారుమూల, గిరిజన ప్రాంతాల పేద ప్రజలకు ఇబ్బందిగా మారకుండా సంచార నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మరణ ధ్రవీకరణ పత్రం అనేది ఆస్తి బదలాయింపు, పింఛన్, బీమా క్లెయిమ్‌లు, వారసత్వం వంటి అనేక చట్టపరమైన అంశాలకు అత్యంత కీలకమైన పత్రమని, ఈ సర్టిఫికెట్ పొందేందుకు ఉన్న నిబంధనలు పేదలకు ఇబ్బందిగా మారకూడదని సూచించారు. మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్య ప్రక్రియలతో అక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. దేశంలోని మారుమూల గ్రామాల్లో రవాణా సౌకర్యాల లేమి, ఇంటర్నెట్ కొరతతో చాలా కుటుంబాలు సమయానికి జనన, మరణాలు నమోదు చేయించుకోలేకపోతున్నాయని కేంద్రం దృష్టికి తెచ్చారు.
గ్రామస్థాయిలో ప్రత్యేక నమోదు కేంద్రాలు, సంచార శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి గిరిజన కుటుంబానికీ చట్టబద్ధ గుర్తింపు అందేలా చూడాలని, ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీల్లో జరిగే ప్రతి జననం, మరణం పౌర నమోదు వ్యవస్థలో స్వయంచాలకంగా నమోదయ్యేలా డిజిటల్ వ్యవస్థను మరింత విస్తరించాలని వద్దిరాజు సూచించారు. ఆలస్యమైన నమోదు దరఖాస్తుల పరిశీలన కోసం ఆన్లైన్ విధానాన్ని తెచ్చి, సాధారణ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పించాలని విజ్ఞప్తి చేశారు.
విమాన ప్రయాణికుల భద్రత, సిబ్బంది ప్రవర్తన, క్రమశిక్షణ అంశాలపై మంగళవారం రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర గళమెత్తారు. డీజీసీఏ ప్రత్యేక మార్గదర్శకాల అమల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించారు. దీనికి పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ స్పంది స్తూ.. విమానాలు, ప్రయాణికులు, విమానాశ్రయ ఆస్తుల రక్షణకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు, అల్లరి ప్రవర్తనను అరికట్టేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆధ్వర్యంలో హ్యాండ్లింగ్ ఆఫ్ అన్ రూలీ, డిస్ప్ట్రివ్ ప్యాసింజర్స్ పేరిట ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉన్నాయని వివరించారు. ప్రత్యేక అవసరాలున్న ప్రయాణికుల కోసం క్యాబిన్ సేఫ్టీ సర్యులర్ నిబంధనలు కూడా పాటిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిషరించే దిశగా చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా 24 గంటల ‘ప్యాసింజర్ అసిస్టెన్స్” కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, విమానాల రాకపోకల సమయం, లగేజీ భద్రత, రీఫండ్ తదితర అంశాలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానయాన సంస్థలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నదని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎయిర్ సేవా పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు తమ ఫిర్యాదులను సులభంగా పరిషరించుకోవచ్చని తెలిపారు.