ప్రెగ్నెన్సీ కారణంగా ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా బ్రేక్‌నిచ్చి విశ్రాంతి తీసుకుంటున్నది అగ్ర కథానాయిక సమంత. అయితే సోషల్‌మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో అప్డేట్స్ను పంచుకుంటున్నది. తాజాగా ఈ భామ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటికి తనదైన తాత్విక ధోరణిలో ఓ క్యాప్షన్‌ను జత చేసింది. ‘సమయం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని సార్లు మనల్ని పోరాటం వైపుకు నడిపిస్తుంది. కొన్నిసార్లు ఓపికతో ఎదురుచూసేలా చేస్తుంది.
ఒక్కోసారి కొన్నింటిని వదిలేయాలని సంకేతాల్ని అందిస్తుంది. మనకు ఏ సమయం కావాలో ఎంచుకునే అవకాశం మన చేతుల్లో ఉండదు. అయితే ఏం జరిగినా మనదైన వ్యక్తిత్వంతో ఎలా జీవితంలో ముందుకుసాగుతున్నామన్నదే చాలా ముఖ్యం’ అంటూ ఫొటోలకు పెట్టిన క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇటీవలే ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది సమంత. ఈ సినిమా వందకోట్ల వసూళ్లతో ఆమె కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.