KTR | కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణను ఏటీఎంగా మార్చడంపై ఉన్న శ్రద్ధ.. ఇచ్చిన హామీల అమలుపై లేకపోవడం దురదృష్టకరం. సీఎం రేవంత్ పాలనను గాలికొదిలి ఢిల్లీకి చక్కర్లూ కొడుతూ, సోకులకు పోతూ పబ్బం గడుపుతున్నరు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసమస్యలపై అధికార కాంగ్రెస్‌ను అడుగడుగునా నిలదీస్తం. వృద్ధులు, మహిళలు, మైనారిటీలు, కార్మికుల పక్షాన అసెంబ్లీలో గొంతెత్తుతం. రిజర్వేషన్ల పేరిట బలహీనవర్గాలకు చేసిన మోసాన్ని ఎండగడుతం. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం కొట్లాడుతం. అంగన్వాడీలు, ఆశ వర్కర్ల సమస్యలు, వారికిచ్చిన హామీల అమలు కోసం పట్టుబడుతం. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను ఆచరణలో పెట్టాలని పోరాడుతం.
-కేటీఆర్
హైదరాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ): రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా, బోనస్ ఎగ్గొట్టి రైతులకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాహుల్‌గాంధీకి మాత్రం వెయ్యి కోట్లు పంపేందుకు సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్.. వాటి అమలులో అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని ధ్వజమెత్తారు.
గద్దెనెక్కిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్‌గాంధీతో గొప్పలు చెప్పించి రెండున్నరేండ్లయినా ఎందుకు బుకాయిస్తున్నదంటూ విరుచుకుపడ్డారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే ముందు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. వారి త్యాగాల స్ఫూర్తితో ప్రజాసమస్యలపై పోరాడుతున్నామని, అసెంబ్లీలో అధికారపక్షాన్ని నిలదీస్తామని ప్రతినబూనారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ చట్టబండలు చేసిందని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలో నాట్లప్పుడే రైతుబంధు జమయ్యేదని.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కోతల కాలానికి కూడా దిక్కులేదంటూ విమర్శించారు. పండుగలు, ఎన్నికల పేరు చెప్పి తప్పించుకోవడం తప్ప రైతుభరోసా అమలుపై స్పష్టత ఇవ్వడం లేదని మండిపడ్డారు.
రైతులను కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. బలహీనవర్గాలకు ఏటా 20వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ. లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చే సిందని ధ్వజమెత్తారు. మూడో బడ్జెట్లోనూ మొండిచెయ్యి చూపాలని చూస్తున్నదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12లక్షలు ఇస్తామనే హామీపై ఊసెత్తడం లేదని దుయ్యబట్టారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి రెండున్నరేండ్లలో పది వేలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.2500 ఇస్తామని మంగళం పాడిందని దెప్పిపొడిచారు. వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లను రెట్టింపు చేస్తామని చెప్పి దగా చేసిందని ధ్వజమెత్తారు. రైతుకూలీలు, ఆటోడ్రైవర్లకు ఏటా రూ.12వేల చొప్పున భృతి చె ల్లిస్తామని చెప్పి బుట్టదాఖలు చేశారని తూర్పారబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి లు చెల్లించకుండా పేద విద్యార్థులను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చడంపై ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీల అమలుపై లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. సీఎం రేవంత్ పాలనను గాలికొదిలి ఢిల్లీకి చక్కర్లూ కొడుతూ, సోకులకు పోతూ పబ్బం గడుపుతున్నారని నిప్పులుచెరిగారు.
తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసమస్యలపై అధికార కాంగ్రెస్‌ను అడుగడుగునా నిలదీస్తామని కేటీఆర్ ప్రకటించారు. వృద్ధులు, మహిళలు, మైనారిటీలు, కార్మికుల పక్షాన గొంతెత్తుతామని స్పష్టంచేశారు. రిజర్వేషన్ల పేరిట బలహీనవర్గాలకు చేసిన మోసాన్ని ఎండగడుతామని తేల్చిచెప్పారు. విరమణ ఉద్యోగుల బకాయిల కోసం కొట్లాడుతామని చెప్పారు. అంగన్వాడీలు, ఆశ వర్కర్ల సమస ట్యలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల కోసం పట్టుబడుతామని ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ అంటే కరప్షన్‌కు కేరాఫ్ అని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. నాటి నుంచి నేటి వరకు అక్రమాలకు పాల్పడడం, హామీలు ఎగ్గొట్టడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఓట్ల కోసం 420 హామీలిచ్చి ఆచరణలో మాత్రం విఫలమైందని ఆరోపించారు. సోమవారం గన్‌పార్క్ వద్ద ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలతో హోరెత్తించారు. ‘రాహుల్‌బంధు వద్దు.. రైతుబంధు ముద్దు’.. ‘అక్రమాల జాతర.. ఆరు గ్యారెంటీలకు పాత ర’.. ‘కాంగ్రెస్ హఠావో.. తెలంగాణ బచా వో’..పింఛన్లు మరిచారు.. పేదల నడ్డి విరిచారు’.. ‘మహాలక్ష్మి మరిచారు.. మహిళలను ముంచారు’.. అంటూ కాంగ్రెస్ మోసాలను పాటల రూపంలో ఎండగట్టారు. అమరులకు జోహార్.. వీరులకు జోహార్..’ అంటూ తెలంగాణ అమరవీరులను కీర్తిస్తూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాటలతో హోరెత్తించారు.