హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అంతా దగా, అబద్ధం, మోసం అంటూ బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నదని మండిపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సర్కారు తప్పులను ఎత్తిచూపారు.
మొత్తం ఎనిమిది పాలసీలను తీసుకొచ్చినట్టు ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో వివరించించింది. ఈ ఎనిమిది పాలసీల పేర్లు గవర్నర్ చదివినప్పుడల్లా ఫాల్స్. ఫాల్స్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం సాగినంత సేపు 75 నిమిషాలపాటు బీఆర్ఎస్ సభ్యులు నిల్చొనే నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరైన గులాబీ నేతలు తమ స్థానాల నుంచే ఆందోళన కొనసాగించారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించకపోవడంలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సభలో ఆందోళన చేపట్టారు.
మక్కీకి.. మక్కీ ట్రాన్స్లేషన్..
సర్కారు సిద్ధం చేసిన గవర్నర్ ప్రసంగ పాఠాన్ని తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ముద్రించారు. అయితే తెలుగు ప్రసంగ పాఠం మొత్తం గందరగోళంగా తయారైంది. ఏఐని వినియోగించి ట్రాన్స్లేషన్ చేసినట్టు అనిపించింది. ఓ చోట గురుకులాలకు బదులు నైవాసిక గృహాలుగా ముద్రితమయ్యింది. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి బదులు ఘాతాంశ ఆర్థిక విస్తరణ అంటూ పేర్కొన్నారు. స్వాతంత్ర శత జయంతి… విమాన అనుసంధానత.. అనే పదాలను వాడారు.
సార్.. కొంచెం మంచినీళ్లివ్వండీ..
‘సార్ కొంచెం మంచినీళ్లు ఇవ్వండీ అంటూ’ అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు అధికారులను వేడుకున్నారు. అసలే ఎండాకాలం, గొంతెండిపోవడంతో నీళ్లు ఇప్పించాలని అభ్యర్థించారు. ప్రత్యేకించి బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ ప్రసంగం సందర్భంగా నినాదాలు చేయడంతో వారి గొంతులెండిపోయి నీళ్లు ఇవ్వాలని కోరారు. కొందరు అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్ అసెంబ్లీ సెక్రటరీ సహా ఇతర అధికారులతో ఇదే విషయంపై చర్చించారు. ఆ తర్వాత కూడా సభ్యులకు మంచినీళ్లు ఇవ్వకపోవడం గమనార్హం.
గవర్నర్ ప్రసంగం – బీఆర్ఎస్ సభ్యుల ప్రతిస్పందనలు