Baba Ramdev : విద్యార్థుల నిరసనలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై యోగా గురువు (Yoga Guru) రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న నిరసనలు, గందరగోళం లాంటివి విద్య, ఉపాధి వ్యవస్థల్లో ఉన్న తీవ్రమైన లోపాలను సూచిస్తున్నాయని అన్నారు. శనివారం పతంజలి యోగపీఠం (Patanjali Yoga Peet) లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా రామ్‌దేవ్ మాట్లాడారు.
పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు వీధుల్లోకి వస్తున్నారని బాబా రాందేవ్ అన్నారు. పేపర్ లీక్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూల సమయంలోనే 90 శాతం అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారు. కులం, మతం, భావజాలం వంటి వాటి ఆధారంగా ఇంటర్వ్యూయర్స్ కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో.. అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పారు.
ప్రజాగ్రహం మరిన్ని నిరసనలకు దారితీయక ముందే వ్యవస్థలను సరిదిద్దుకోవాలని సూచించారు. అవినీతి, అవకతవకల ఆరోపణలను తేలిగ్గా విస్మరించలేమని చెప్పారు. ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. నిరసనల పేరిట అరాచకాన్ని, హింసను తాను సమర్థించనని రామ్‌దేవ్ బాబా పేర్కొన్నారు. అలాగే రాజకీయ పార్టీలకు సూచనలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదాన్ని మరొకటి శత్రువులుగా భావించుకోకూడదన్నారు.
ప్రభుత్వం, ప్రతిపక్షంతోపాటు భారత్‌లోని కులాలు వర్గాల మధ్య పరస్పరం గౌరవం ఉండాలని బాబా రాందేవ్ పిలుపునిచ్చారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. దాంతో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు ఝార్ఖండ్‌లో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు.