Digital Arrest | దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సొమ్ము కాజేసేందుకు నేరగాళ్లు కొత్త కొత్త దారులను వెతుక్కుంటున్నారు. సైబర్ మోసాలపై ఎంత అవగాహన కల్పించినా, ప్రతిరోజూ ఏదో ఒకచోట పదుల సంఖ్యలో జనం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పెద్ద మొత్తంలో సొమ్ము పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ సైబర్ ఉచ్చులో చిక్కుకుని ఏకంగా కోట్ల రూపాయలను పోగొట్టుకుంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది.
ఇందుకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ (Bengaluru woman)ను సీబీఐ అధికారులమంటూ (CBI officials) కొందరు డిజిటల్ అరెస్ట్ చేశారు. ముందుగా డీహెచ్ఎల్లో ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఓ వ్యక్తి సదరు మహిళకు ఫోన్ చేశాడు. ఆమె పేరు మీద మూడు క్రెడిట్ కార్డులు, నాలుగు పాస్‌పోర్టులు, నిషేధిత MDMA ఉన్న ఓ పార్శిల్ ముంబైలోని అంధేరీ డీహెచ్ఎల్ కేంద్రానికి వచ్చిందని చెప్పాడు. ఆ ప్యాకేజీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను బెంగళూరులో నివసిస్తున్నట్లు ఆమె చెప్పింది. అయితే, ఫోన్ చేసిన వ్యక్తి మీ ఫోన్ నెంబర్ పార్శిల్‌తో లింక్ అయ్యి ఉందని.. అది సైబర్ క్రైమ్ కావొచ్చని హెచ్చరించాడు. వాటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారని బెదిరించాడు. సీబీఐ అధికారుల నుంచి ఫోన్‌కాల్ వస్తుందని తెలిపాడు.
ఆ కాసేపటికే సీబీఐ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పార్శిల్లో ఉన్న ఆధారాల ద్వారా ఆమెను డిజిటల్ అరెస్టు చేసినట్లు బెదిరించాడు. అంతేకాదు మీపై నేరస్థులు నిఘా పెట్టారని.. పోలీసులను సంప్రదించొద్దంటూ సూచించాడు. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే అన్ని ఆస్తులను ఆర్బీఐకి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉందని నమ్మించాడు. వారి మాటలకు భయపడిపోయిన మహిళ వారు చెప్పినట్లు చేసింది. మొత్తం తన వద్ద ఉన్న ఆస్తులు, డబ్బు అంతా వారికి అప్పగించింది. ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇతర సేవింగ్స్‌ను మోసగాళ్లు పంపిన 187 బ్యాంకు ఖాతాలకు విడతలవారీగా బదిలీ చేసింది. ఇలా దాదాపు ఆరు నెలల్లో ఆమె నుంచి రూ.32 కోట్లు దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. క్లియరెన్స్ పూర్తయ్యాక ఫిబ్రవరిలో ఆ డబ్బును తిరిగిస్తామని చెప్పారు. ఈ మేరకు బాధితురాలికి నకిలీ క్లియరెన్స్ లెటర్‌ను కూడా జారీ చేశారు.
కొన్ని రోజులకు ఆమె తన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి చేసింది. అయినా అటువైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇలా కొన్ని రోజుల తర్వాత వారు ఆమెతో కమ్యూనికేషన్‌ను ఆపేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ డిజిటల్ అరెస్ట్‌లో రూ.31.83 కోట్లు కోల్పోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Nitish Kumar | సీఎంగా నితీశే కొనసాగుతారు.. బీహార్ బీజేపీ చీఫ్
Bomb Threats | సీఎం స్టాలిన్ సహా పలువురి నివాసాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
Bihar | 20న బీహార్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. హాజరుకానున్న ప్రధాని మోదీ