Bomb Threats | తమిళనాడు చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సహా పలువురు సినీ ప్రముఖులకు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు.
సీఎం ఎంకే స్టాలిన్‌తోపాటూ ప్రముఖ నటులు అజిత్ కుమార్ (Ajith Kumar), అరవింద్ స్వామి (Aravind Swamy), ఖుష్బూ (Khushbu) నివాసాలను ఆదివారం రాత్రి బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డీజీపీ కార్యాలయానికి ఆ బెదిరింపు మెయిల్ వచ్చింది. బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారి నివాసాల వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీల చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో అది బూటకపు బెదిరింపుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, తమిళనాడులోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు గత కొన్నిరోజులుగా వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats In Chennai) వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్, ప్రముఖ నటులు త్రిష, నయనతార, ప్రభు, రజినీకాంత్, ధనుష్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా (Ilaiyaraaja) స్టూడియోస్, బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్, చెన్నైలోని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అయితే, అవన్నీ నకిలీ బెదిరింపులుగా అధికారులు తేల్చారు.
Also Read..
Cabinet Meeting | నేడు బీహార్ క్యాబినెట్ చివరి సమావేశం.. గవర్నర్‌ను కలువనున్న సీఎం నితీశ్
ప్రగతి సూచీల్లో పతనం.. అంతర్జాతీయ ఇండెక్సుల్లో జారుడు మెట్లపై భారత్
Sabarimala | తెరచుకున్న శబరిమల.. నేటి నుంచి అయ్యప్ప దర్శనాలు