మల్యాల, మార్చి 1 : కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలను తానొక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నానని, ఇప్పుడు నంది, గాయత్రీ, రాంపూర్ పంప్‌హౌస్‌ల్లో ఎత్తిపోస్తున్న జలాలు ఎక్కడివో చెప్పాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నిలదీశారు. ఆ పార్టీ నాయకులు కండ్లుండీ చూడలేని కబోదుల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా మల్యాల మండలంలో నిర్మించిన రాంపూర్ పంప్‌హౌస్ నుంచి వరదకాలువ ఎగువకు పంపింగ్ చేస్తున్న జలాలకు ఆదివారం బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సుంకె మాట్లాడుతూ, కాళేశ్వరం జలాలతో వరద కాలువను సజీవంగా మార్చేందుకు నిర్మించిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం అంతర్భాగమేనని, నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారానే వరద కాలువలోకి జలాలు తరలివస్తున్నాయని చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌కు ఎగువన అనేక ప్రాజెక్ట్‌లు కట్టడంతో ఎస్సారెస్పీ ప్రశ్నార్థకంగా మారిందని, ఈ క్రమంలోనే సముద్రంలోకి వృథాగా పోతున్న గోదారి జలాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారని చెప్పారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద మూడు పంప్‌హౌస్‌లను నిర్మించి వరద కాలువను ఏడాది పొడవునా సజీవంగా ఉంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాళేశ్వరం వృథా అన్న కాంగ్రెస్ నాయకులు ఈ రోజు పంప్‌హౌస్ మోటర్లను ఎందుకు వినియోగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ శ్రేణులు నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రాజెక్టులో నడుస్తున్న మోటర్లే అందుకు నిదర్శనమన్నారు. ఇక్కడ మండల నాయకులు అయిల్నేని సాగర్‌రావు, బోయినిపల్లి మధుసూదన్‌రావు, గడ్డం మల్లారెడ్డి, క్యాతం భూపతిరెడ్డి, పొన్నం మల్లేశం, అజహరోద్దీన్, జనగం శ్రీనివాస్, జోగినిపెల్లి శ్రీనివాస్, అమీర్, కుసుమ వెంకటి, లచ్చయ్య పాల్గొన్నారు.