న్యూఢిల్లీ : ఏ దేశం అభివృద్ధి స్థాయినైనా అంచనా వేయడానికి అంతర్జాతీయ సూచీలు ఒక ముఖ్యమైన ప్రమాణం. ఆర్థిక వ్యవస్థ, మానవ హక్కులు, మీడియా స్వేచ్ఛ, అవినీతి స్థాయి, ప్రజాస్వామ్య నాణ్యత, జీవన ప్రమాణం వంటి పలు అంశాలను ఆధారంగా చేసుకుని వివిధ సంస్థలు ప్రతి ఏడాది ర్యాంకులను విడుదల చేస్తాయి. ఇటీవలి కాలంలో ఈ సూచీల్లో భారత్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ కన్పిస్తున్నది. ఏదో ఒకటి రెండు కాదు. చాలా అంశాల్లో ఇదే పరిస్థితి. మోదీ హయంలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా మారినట్టు డాటా చెబుతున్నది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకునే భారత్‌లో పత్రికా స్వేచ్ఛ మాత్రం పాతాళంలో ఉంది. అంతర్జాతీయ సూచీల ప్రకారం కొన్ని అంశాల్లో భారత్ పతనం ఎలా కొనసాగుతున్నదో ఒకసారి పరిశీలిద్దాం.
మానవ అభివృద్ధి సూచీని చూస్తే 2014లో భారత్ ర్యాంక్ 130. అది ఇప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా అలానే ఉంది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్) ప్రెస్ ఫ్రీడమ్ సూచీలో భారతదేశం 2014లో 140లో ఉండగా, నేడు అది 151కు దిగజారింది. పాత్రికేయులపై హింస, అధిక కేంద్రీకృత మీడియా యాజమాన్యం, రాజకీయ సమలేఖనం కారణంగా, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతికా స్వేచ్ఛ సంక్షోభంలో ఉంది అని ఈ అంకెలు చెబుతున్నాయి. కాటో ఇన్స్టిట్యూట్ మానవ స్వేచ్ఛా సూచికలో భారతదోశం 2014లో 87లో ఉండగా, నేడు 110కి చేరింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో 2014లో 110లో ఉండగా, నేడది 131కు చేరింది. పార్లమెంట్లో మహిళా ప్రాతినిధ్యంలో 14.7 శాతం నుంచి 2025కు 13.8 శాతానికి పడిపోయింది. అదే విధంగా మంత్రి పదవులలో మహిళల వాటా 6.5 శాతం నుంచి 5.6 శాతానికి తగ్గిపోయింది.

ఆకలి, పిల్లల్లో పెరుగుదల లేకపోవడం, పోషకాహార లోపం వంటి అంశాలను పర్యవేక్షించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం 2014లో మొత్తం 76 దేశాలలో భారత్ 55వ స్థానంలో ఉండగా, నేడు 123 దేశాలలో 102వ స్థానంలో ఉంది. ‘భారతదేశంలో ఆకలి స్థాయి తీవ్రంగా ఉంది’ అని ఈ నివేదిక చెబుతున్నది. కాగా, ఆకలి సూచీలో భారత దేశం ర్యాంక్ క్షీణించడం ప్రారంభించినప్పుడు ప్రభుత్వం 2021 పార్లమెంట్లో ఒక విషయాన్ని చెప్పింది. భారతీయులు ఆకలితో ఉండటం సాధ్యం కాదని, అటువంటి నివేదికల పట్ల మనం సున్నితంగా ఉండకూడదని చెప్పింది. అంతేకాకుండా డాటా సమకూర్చే సంస్థలు తమపై పక్షపాతంతో ఉన్నాయని, అలాంటి వాటిని విస్మరించాలని నిర్ణయించినట్టు తెలిపింది. అయినప్పటికీ డాటా వస్తూనే ఉంది. భారత దేశ వైఫల్యాన్ని ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నాయి. అయితే అలాంటి చెడు గురించి వినకపోతే అది మాయమైపోతున్నదన్న భ్రమలో ప్రభుత్వం ఉందని, డాటా ఎప్పుడూ వాస్తవ పరిస్థితులను వెల్లడిస్తూనే ఉంటాయని, వాటిని దూరంగా పెట్టినా, పట్టించుకోక పోయినా లోపాలు, వైఫల్యాలు, తప్పులు ఎత్తిచూపుతూనే ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ సూచీలు ఏకపక్షంగా, విమర్శనీయమైనవిగా భావించినా, అవి ఒక దేశం ఇమేజ్‌కు పెద్ద సూచికలని వాటిని విస్మరించ లేమని వారు తెలిపారు.