పెన్‌పహాడ్, మార్చి 1 : శ్రీరాంసాగర్ రెండోదశ ఆయకట్టుకు గోదావరి జలాలు అరకొరగా విడుదల కావడంతో యాసంగిలో సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉందని భావించి పంటలు సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే సాగు నీరు రాక చేతి కొచ్చిన పంటలు ఎండిపోయి రైతులు బోరుమంటున్నారు. చేసేదేమీ లేక పంట పొలాల్లో పశువులు మేపుతున్నారు. మండల పరిధిలోని చిన్న సీతారాం తండా, పెద్ద సీతారాం తండా, మేగ్యా తండా, నూర్జహాన్పేటల్లో కొందరు రైతులు చేలల్లో పశువులు మేపుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆయకట్టు చివరి వరకు నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. గోదావరి జలాలు చివరి వరకు చేరాలని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి రాత్రి పగలు తేడా లేకుండా కాలువ వెంట మోటర్ బైక్‌పై వెళ్లి డీపీఎం -71 చివర ఉన్న పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామ శివారులోని చెరువులను నీటితో నింపించారు.
కాలువల్లోకి నీళ్లు విడుదల చేయగానే ఆయకట్టు చివరి నుంచి మొదటికి నీళ్లు రావాలని అధికారులకు సూచించారు. దీంతో ఆయకట్టు చివరి నుంచి మొదటి వరకు ఉన్న చెరువులు నింపేవారు. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈరెండేళ్లలోనూ వేసిన నాలుగు పంటలకు నీళ్లందించలేకపోయింది. శ్రీరాంసాగర్ నీటి విడుదలపై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు పట్టింపు లేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. పెన్‌పహాడ్ మండలంలో పలువురు రైతులు మాట్లాడుతూ గోదావరి జలాలు వారబందీ విధానంలో చివరి వరకు వస్తే వాటి ద్వారా చెరువులు, కుంటలు నిండే అవకాశం ఉంటుందని,దీంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. రైతులు కేవలం కాలువ నీటిపైనే కాకుండా బోర్లు, బావులు, చెరువుల ఆధారంగా పొలాలను కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి.
వేసింది రెండెకరాలే అయినా..
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వానాకాలం, యాసంగి సీజన్లో మొత్తం నాటు వేసినం. ఒక్క సీజన్లో కూడా ఎండకుండా పంట చేతికొచ్చింది. కాలువ నీళ్లు సక్రమంగా రావడంతో ఇది సాధ్యమైంది. గతంలో కూడా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలోనే నీళ్లు ఇచ్చినా చివరి వరకు అందాయి. నీటిని నిలిపివేసినప్పుడు బావుల్లో ఉన్న నీళ్లను వాడుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈసారి ఉన్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలే సాగు చేసినా నీళ్లు సరిపోక పొలం ఎండిపోతోంది.
-వాంకుడోతు గీత రైతు, నూర్జహాన్‌పేట