Nitish Kumar | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 202 సీట్లతో జయభేరి మోగించింది. ఇందులో బీజేపీకి 89, నితీశ్ కుమార్కు చెందిన జేడీ(యూ)కు 85, కూటమి పార్టీలైన ఎల్జేపీ (రామ్ విలాస్)కి 19, హెచ్ఏఎం 5 , ఆర్ఎల్ఎస్పీ 4 సీట్లలో విజయం సాధించాయి. దీంతో రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టేందుకు ఎన్డీయే కూటమి సిద్ధమవుతోంది. అదే సమయంలో సీఎం (Chief Minister) ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకూ బీహార్ సీఎంగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజా ఫలితాల్లో బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో నితీశ్ కుమార్ను తప్పించి కమలం పార్టీకి చెందిన నేతను సీఎంగా ప్రకటించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై బీహార్ బీజేపీ చీఫ్ స్పష్టతనిచ్చారు. నితీశ్ కుమారే సీఎంగా కొనసాగుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ (Dilip Jaiswal) స్పష్టం చేశారు. బీజేపీ శానసభా పక్షం రేపు ఉదయం 10 గంటలకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలమంలో తన నాయకుడిని ఎన్నుకుంటుందని తెలిపారు. ఆ తర్వాత వెంటనే ఎన్డీయే శానసభా పక్షం సమావేశమై నితీశ్ కుమార్ను సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తుందన్నారు.
కాగా, ఈనెల 20న బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎంగా నితీశ్ కుమారు, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్ వేదిక కానుంది. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ (PM Modi)తోపాటూ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు తెలిసింది. మరోవైపు ఇవాళ ఉదయం 11.30 గంటలకు ప్రస్తుత మంత్రిమండలి చివరిసారిగా భేటీ కానుంది. సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు తీర్మాణం చేయనున్నారు. అనంతరం నితీశ్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు అందించనున్నట్లు జేడీయూ సీనియర్ వెల్లడించారు.
Also Read..
Bihar | 20న బీహార్లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
Bomb Threats | సీఎం స్టాలిన్ సహా పలువురి నివాసాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు