ఇస్లామాబాద్: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర పోరు సాగుతోంది. రెండు దేశాల బోర్డర్ వద్ద జరిగిన ఫైరింగ్ తీవ్ర దాడులకు దారి తీసింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సర్కారుపై పాక్(Pakistan Air Force) విరుచుకుపడింది. కాబూల్, కాందహార్, పక్తియా పట్టణాల్లో ఉన్న ఆఫ్ఘన్ తాలిబన్ సైనిక కేంద్రాలను పాకిస్థాన్ వైమానిక దళం ధ్వంసం చేసింది. గురువారం అర్థరాత్రి పీఏఎఫ్ వైమానిక దాడులకు దిగింది. ఆ దాడుల్లో సుమారు 133 మంది ఆఫ్ఘన్ తాలిబన్లు మరణించినట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. కాబూల్‌లో ఉన్న రెండు బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్ ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. కాందహార్‌లో ఉన్న ఓ కార్ప్ హెడ్‌క్వార్టర్, మరొక బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్ ధ్వంసం అయ్యాయి. పాకిస్థాన్ మీడియా ప్రకారం కాందహార్‌లో ఉన్న ఆయుధ డిపో, లాజిస్టిక్స్ బేస్ కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కాందహార్ గగనవీధుల్లో పాకిస్థాన్ విమానాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. టార్గెట్లను పేల్చిన తర్వాత పీఏఎఫ్‌కు చెందిన యుద్ధ విమానాలు ఆఫ్ఘన్‌లోని కొన్ని కేంద్రాలపై వైమానిక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ సైనిక బలగాలు సంసిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బోర్డర్ వద్ద జరిగిన ఫైరింగ్ తర్వాత ఆపరేషన్ ఘజబ్ లిల్-హక్‌ను మొదలుపెట్టిన పాకిస్థాన్ ప్రకటించింది. ఖైబర్ ఫక్తున్‌క్వా బోర్డర్ వద్ద పలు ప్రదేశాల్లో ఆఫ్ఘన్ తాలిబన్ ఫైరింగ్‌కు పాల్పడిందని పాకిస్థాన్ సమాచారశాఖ మంత్రి తెలిపారు. ఆఫ్ఘన్‌పై జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లోని నాన్గర్ ప్రావిన్సులో ఉన్న అమ్యూనిషన్ డిపోను పేల్చివేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
తాలిబన్‌కు చెందిన 27 పోస్టులను ధ్వంసం చేశామని, తొమ్మిదింటిని స్వాధీనం చేసుకున్నామని పాక్ ప్రతినిధి ఒకరు తెలిపారు.