Suicide : వరకట్న వేధింపులు (Doury harassment) తాళలేక ఓ యువతి ఆత్మహత్య (Suicide) కు పాల్పడింది. ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన యువతి కొన్ని నెలలకే వరకట్న దాహానికి బలైంది. కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చింది. కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఈ నెల 13న ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని డెంకణీకోట తాలూకా కూటురు గ్రామానికి చెందిన గోపాలప్ప కూతురు గాయత్రితో హోసూరు గోకుల్నగర్కు చెందిన మురుగేషన్ కొడుకు కదిరేషన్కు 11 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు సరిగానే ఉన్న కదిరేషన్ కుటుంబసభ్యులు ఆ తర్వాత వారి నిజ స్వరూపం బయటపెట్టారు.
అదనపు కట్నం తీసుకురావాలని గాయత్రిని వేధించారు. ఆ వేధింపులు తాళలేక గాయత్రి పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో పెద్దల సమక్షంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇకపై బాగా చూసుకుంటానని కదిరేషన్ మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత గాయత్రితో బెంగళూరులో కాపురం పెట్టాడు. కానీ వరకట్న వేధింపులు ఆపలేదు.
దాంతో ఈ నెల 13న గాయత్రి ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వారి వరకట్న వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ రాసింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే పెళ్లి సమయంలో 40 తులాల బంగారం, రూ.6 లక్షల నగదును కట్నంగా ఇచ్చామని, ఇప్పుడిలా జరిగిందని గాయత్రి తల్లిదండ్రులు బోరున విలపించారు.