Aishwarya Rai : బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) సోషల్ మీడియా (Social media) వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం మితిమీరిపోతోందని, గుర్తింపు కోసం దానిపై ఆధారపడటం సరైన పద్ధతి కాదని ఆమె అన్నారు. ప్రజలు ఆత్మవిశ్వాసం కోసం సోషల్ మీడియా వైపు చూడటం తనను ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు.
ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్లు, షేర్ల ఆధారంగా మన విలువను అంచనా వేసుకోవద్దు. నిజమైన గుర్తింపు మనలోనే ఉంటుంది తప్ప, ఆన్లైన్ వేదికల్లో వెతికితే దొరకదు. సామాజిక మాధ్యమాలు, సమాజం నుంచి వచ్చే ఒత్తిడి రెండూ ఒకటే. ఆత్మగౌరవం కోసం అక్కడ వెతకడం వృథా ప్రయాస’ అని అన్నారు.
ఒక తల్లిగా ఈ ధోరణి తనను తీవ్రంగా కలవరపెడుతోందని ఐశ్వర్య తన ఆవేదనను పంచుకున్నారు. ‘ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. ఈ వ్యసనం నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. ఐశ్వర్య చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.