వేములవాడ టౌన్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సతీమణి శోభ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు దర్శించుకున్నారు. ఆలయంలో వారికి అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడే మొక్కులు నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయంలో గణపతికి, రాజరాజేశ్వర స్వామి వారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం ఆలయ అద్దాల మండపంలో రాజన్న ఆలయ విశ్రాంత స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ చంద్రగిరి శరత్, గోపన్నగారి చందు వేదొక్త ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రం కప్పి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, వేములవాడ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థం మాధవి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.