Gauhati HC : అసోం (Assam) రాష్ట్రంలోని డిమా హసావో (Dima Hasao) జిల్లాలో మహాబల్ సిమెంట్స్ (Mahabal cements) అనే ప్రైవేట్ సిమెంట్ కంపెనీకి ఏకంగా 3,000 బీఘాల (దాదాపు 992 ఎకరాలు) భూమిని కేటాయించడంపై గౌహతి హైకోర్టు (Gouhati high court) విస్మయం వ్యక్తంచేసింది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అసాధారణమైనదిగా అభివర్ణించిన న్యాయస్థానం.. ‘ఇది పరిహాసమా.. ఒక జిల్లా మొత్తాన్ని రాసిస్తున్నారా..?’ అంటూ సీరియస్గా ప్రశ్నించింది.
విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కుమార్ మేధి భూ కేటాయింపుల గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఒక ప్రైవేట్ కంపెనీకి 3000 బీఘాలా? అది బీడు భూమి అయినా ఇంత పెద్ద మొత్తంలో కేటాయించడం ఏమిటి..? ఇక్కడ కంపెనీకి ఎంత భూమి అవసరం అన్నది కాదు, ప్రజా ప్రయోజనమే ముఖ్యం’ అని వ్యాఖ్యానించారు. ఈ భారీ భూ కేటాయింపునకు సంబంధించిన అన్ని రికార్డులు, ప్రభుత్వ విధాన పత్రాలను తమముందు ఉంచాలని ‘నార్త్ కచార్ హిల్స్ అటానమస్ కౌన్సిల్ (NCHAC)’ ని న్యాయస్థానం ఆదేశించింది.
డిమా హసావో జిల్లా రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలోకి వస్తుందని, ఇక్కడి గిరిజన తెగల హక్కులు, ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు గుర్తుచేసింది. కంపెనీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. అది పూర్తిగా బీడు భూమి అని, ఫ్యాక్టరీ నిర్మాణానికి అంత భూమి అవసరమని చెప్పారు. టెండర్ ద్వారా పొందిన మైనింగ్ లీజుకు కొనసాగింపుగానే ఈ కేటాయింపు జరిగిందని తెలిపారు.
ఇదిలావుంటే చట్టబద్ధంగా తాము హక్కులు కలిగి ఉన్న భూముల నుంచి సిమెంటు కంపెనీ కోసం బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని స్థానిక కుటుంబాలు తమ పిటిషన్లలో పేర్కొన్నాయి. అందుకే కంపెనీకి ఎంత భూమి అవసరం అన్నదానికంటే, ప్రజాప్రయోజనాలకు భంగం కలుగకూడదన్నదే ముఖ్యమంత్రి కోర్టు వ్యాఖ్యానించింది.
అంతేగాక ఇంత పెద్ద మొత్తంలో భూమిని ఒకే కంపెనీకి ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని అస్సాం ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలోగా భూ రికార్డులు, విధాన పత్రాలను సమర్పించాలని స్పష్టం చేసింది.