Fake app : ఒక ఫేక్ యాప్ (Fake app) విషయంలో ‘సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)’ అప్రమత్తమైంది. సీఆర్పీఎఫ్కు చెందిన ప్రామాణిక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్ ఉందని తెలిపింది. సిబ్బంది వ్యక్తిగత, సంస్థాగత వివరాలను తస్కరించేలా ఆ యాప్ ఉందని, అది భద్రతాపరంగా తీవ్రమైన ముప్పును కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మొత్తం 3.25 లక్షల మంది సిబ్బందికి సీఆర్పీఎఫ్ సూచించింది.
‘సంభవ్ అప్లికేషన్ రైటర్’ పేరిట ఓ యాప్‌పై వాట్సాప్, యూట్యూబ్ సహా ఆయా ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో ప్రచారం జరుగుతోందని సీఆర్పీఎఫ్ ఐటీ విభాగం అడ్వైజరీ జారీ చేసింది. ఆ అప్లికేషన్‌ను తాము రూపొందించలేదని, వినియోగానికి కూడా సిఫార్సు చేయలేదని ఓ అధికారి తెలిపారు. ఆన్లైన్ ప్లే స్టోర్ల నుంచి దాన్ని తొలగించాలని ప్రభుత్వ సైబర్ భద్రతాసంస్థలను కోరినట్లు ఆయన వెల్లడించారు.
‘సీఆర్పీఎఫ్ సంభవ్’ పేరిట అసలైన యాప్ వినియోగంలో ఉంది. బలగాలు, ఇతర సిబ్బంది తమ వేతనాలు, సెలవులు, బదిలీలకు అర్హత వంటి వ్యక్తిగత, అడ్మినిస్ట్రేటివ్ వివరాలను పరిశీలించేందుకు దాన్ని ఉపయోగిస్తారు. అయితే ‘సంభవ్ అప్లికేషన్ రైటర్’ పేరిట చక్కర్లు కొడుతున్న నకిలీ యాప్.. సిబ్బందికి ఉపయుక్తంగా ఉంటుందని చెబుతూ వారి వివరాలు అడుగుతోందని సీఆర్పీఎఫ్ తన అడ్వైజరీలో పేర్కొంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.