పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కసరత్తు పూర్తయ్యింది. దీంతో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసింది. సుమారు 38 లక్షల మేర ఓటర్ల సంఖ్య తగ్గింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు రెండింతలు తగ్గారు. 2025 జనవరి 1 నాటికి బీహార్లో 7.8 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు. అయితే సర్ పక్రియ తర్వాత 38 లక్షలు మంది ఓటర్లు తగ్గారు. ఈసీ జారీ చేసిన తుది జాబితాలో ప్రస్తుతం 7.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 3.8 శాతం (15.5 లక్షలు) తగ్గగా, మహిళా ఓటర్లు 6.1 శాతం (22.7 లక్షలు) మేర తగ్గారు.
కాగా, గోపాల్గంజ్ జిల్లాలో మహిళా ఓటర్ల తొలగింపు అత్యధికంగా నమోదైంది. జనవరిలో 10.3 లక్షలు ఉండగా తుది జాబితాలో ఈ సంఖ్య 8.3 లక్షలకు చేరింది. 15.1 శాతం మేర అంటే 1.5 లక్షల తగ్గుదల నమోదైంది. ఆ తర్వాత మధుబని జిల్లాలో 1.3 లక్షల మంది, పూర్వి చంపారన్ జిల్లాలో 6.7 శాతం మేర 1.1 లక్షల మహిళలు తమ ఓట్లు కోల్పాయారు. సరన్, భాగల్పూర్ జిల్లాల్లో సుమారు లక్ష మంది మహిళా ఓటర్లు జాబితా నుంచి వైదొలగారు. పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ (గోపాల్గంజ్, సరన్), జార్ఖండ్ (భాగల్పూర్), పొరుగు దేశమైన నేపాల్ (మధుబని, పూర్వి చంపారన్) సరిహద్దులో ఈ జిల్లాలు ఉండటం గమనార్హం.
మరోవైపు ఓటర్ తుది జాబితాలో పురుషులు కూడా గణనీయంగా తగ్గారు. 95,000 మంది పురుష ఓటర్ల (17.4 లక్షల నుంచి 16.4 లక్షలకు) తొలగింపుతో మధుబని జిల్లా ముందంజలో ఉన్నది. 90,000 ఓటర్ల తగ్గుదలతో (26.3 లక్షల నుంచి 25.4 లక్షలకు) పాట్నా జిల్లా తర్వాత స్థానంలో నిలిచింది. ఇతర జిల్లాలైన సరన్ (86,000), పూర్వి చంపారన్ (85,000), గోపాల్గంజ్ (80,000)లో కూడా పురుష ఓటర్లు గణనీయంగా తగ్గారు. మొత్తం మీద 59 అసెంబ్లీ స్థానాలున్న ఆరు జిల్లాలైన గోపాల్గంజ్, మధుబని, పూర్వి చంపారన్, సరన్, భాగల్పూర్, పాట్నాలో పురుష, మహిళా ఓటర్లను ఎక్కువ సంఖ్యలో తొలగించారు.
Also Read:
Tej Pratap | రాముడు ఎవరో, లక్ష్మణుడు ఎవరో తేజస్వీ అర్థం చేసుకోవాలి: తేజ్ ప్రతాప్
Mud Volcano Erupts | 20 ఏళ్ల తర్వాత బద్దలైన.. భారత్లోని ఏకైక మట్టి అగ్నిపర్వతం
Woman Murders Daughter, Kills Self | కుమార్తెను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ
Delivery Boy Kidnaps, Rapes Girl | బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసిన డెలివరీ బాయ్