Shaikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో నిరసనల నేపథ్యంలో ఆమె సోమవారం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సైనిక విమానంలో భారత్‌కు బయలుదేరారు. సాయంత్రం 5.36 గంటలకు ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌కు చేరుకున్నారు. అక్కడ ఎయిర్‌ఫోర్స్ అధికారులకు ఆమె స్వాగతం పలికారు. అయితే, ఆమె భారత్ నుంచి లండన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మరో వైపు బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బీఎస్ఎఫ్ సోమవారం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలెర్ట్ ప్రకటించింది.
సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చగా నిరసనకారులు ప్రధాని హసీనా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం పదవికి రాజీనామా చేశారు. సోదరితో కలిసి దేశాన్ని వీడారు. ఆ దేశంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సైన్యం సహాయం చేస్తుందని ఆర్మీ చీఫ్ ప్రకటించారు. షేక్ హసీనా భవనాన్ని వదిలి వెళ్లాక నిరసనకారులు ప్రధాని నివాసంలోకి చొచ్చుకు వెళ్లారు. మరో వైపు హింసాత్మక ఘటనలతో నిలిపివేసిన బంగ్లాదేశ్‌లో టెలికాం సేవలను పునరుద్ధరించారు. దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైతం అందుబాటులోకి వచ్చాయి.
ఇదిలా ఉండగా.. కోల్‌కతా-ఢాకా-కోల్‌కతా మైత్రీ ఎక్స్‌ప్రెస్ సేవలు మంగళవారం రద్దు చేసినట్లు తూర్పు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే మైత్రీ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు ఈ నెల 6 వరకు నిలిపివేశారు. హింసాత్మక నిరసనల కారణంగా జూలై 21 నుంచి రెండు వారాలకు ఒకసారి నడిచే కోల్‌కతా-ఖుల్నా-కోల్‌కతా బంధన్ ఎక్స్‌ప్రెస్ కార్యాకలాపాలు రద్దయ్యాయి. మరోవైపు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. షేక్ హసీనా ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందన్న వార్తలతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల సైతం పోలీసులను మోహరించారు.