Bangladesh | బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసన హింసాత్మకంగా మారింది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలన్న డిమాండ్‌తో గత నెలలో మొదలయ్యాయి. చివరకు ఈ నిరసనలు ప్రభుత్వ వ్యతిరేకంగా మారాయి. చివరకు ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా తప్పుకోవాలంటూ నిరసనకారులు ఉద్యమించారు. రోజు రోజుకు పెరుగుతున్న ఆందోళనల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆర్మీ హెలికాప్టర్లో దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మరోవైపు సోమవారం బంగ్లా రాజధాని ఢాకాలో భారీ రాలీ నిర్వహించాలని ఆందోళనకారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే హింసాత్మక ఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో సైన్యం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. ఇప్పటికే ఘర్షణల్లో 300 మందికిపైగా నిరసన దుర్మరణం చెందారు.
వివాదాస్పద రిజర్వేషన్ విధానాన్ని నిలిపివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు 30శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌తో సంబంధాలున్న వ్యక్తులు మాత్రమే ప్రస్తుత రిజర్వేషన్లతో ప్రయోజనం పొందుతున్నారని నిరసనకారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వంపై నిరసనకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత నిరసనలను నియంత్రించడంలో ప్రభుత్వం వైఫలమైంది. మరో వైపు రిజర్వేషన్లపు సుప్రీంకోర్టు తీర్పుపై సైతం నిరసనకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాల్సిందేనని నిరసనకారులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ ఇక్బాల్ కరీం సైతం ఆందోళనకారులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తీవ్రంగా విమర్శించారు.
ప్రస్తుత ఆర్మీ చీఫ్ నిరసనకారులకు మద్దతు ఇవ్వడంతో దేశంలో అల్లర్లు మరింత పెరిగాయనే విమర్శలున్నాయి. అయితే, బంగ్లాదేశ్‌లో ఈ నిరసనల వెనుక పాక్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని ‘ఛత్ర శివిర్’ అనే విద్యార్థి సంస్థ హింసకు ప్రేరేపించినట్లు సమాచారం. ఈ విద్యార్థి సంస్థ బంగ్లాదేశ్‌లోని నిషేధిత జమాత్ ఏ ఇస్లామీకి చెందిన ఓ శాఖ కావడం గమనార్హం. జమాతే ఇస్లామీకి పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ మద్దతు ఉందని తెలుస్తున్నది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐఎస్ఐ కూడా జోక్యం చేసుకుందా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయంపై ప్రభుత్వం విచారణ ఆదేశించినట్లు తెలుస్తున్నది.