ఢాకా: బంగ్లాదేశ్(Bangladesh)లో నిరుద్యోగ యువత వందల సంఖ్యలో తుపాకీ తూటాలకు బలవుతున్నారు. ఆ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లు, హింసకు.. రిజర్వేషన్ వ్యవస్థే కారణం. వివాదాస్పదమైన ఆ కోటా సిస్టమ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో .. ఎంతో మంది బంగ్లాదేశీ సమరయోధులు ప్రాణాలు కోల్పోయారు. వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటా ఇస్తూ ఇటీవల ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ .. యువత ఆందోళనకు దిగారు.
వాస్తవానికి ఈ కోటా సిస్టమ్‌ను మాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ ప్రవేశపెట్టారు. పారిపోయిన షేక్ హసీనా తండ్రే ఆయన. 1972లో ఆ కోటా వ్యవస్థను తీసుకువచ్చారు. అయితే 2018 అక్టోబర్‌లో .. ఆ రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేసేందుకు హసీనా అంగీకరించారు. విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టడంతో ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది జూన్‌లో హసీనా సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టిపారేసింది. 1971లో మృతిచెందిన సమరయోధుల బంధువులు వేసిన పిటీషన్ల ఆధారంగా ఆ కోటాను వ్యవస్థను మళ్లీ తీసుకువచ్చారు. కోర్టు కొత్త ఆదేశాలతో.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 56 శాతం కోటా .. ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు. ఫ్రీడం ఫైటర్ల మనవళ్లు, మనవరాళ్లు, మహిళలకు రిజర్వేషన్లను పెంచారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగాల కోసం వెతుకున్న యువత ఆందోళనకు దిగింది. ఫ్రీడం ఫైటర్లకు చెందిన మూడవ జనరేషన్‌కు ఎందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆ యువత ఇటీవల బంగ్లా వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
అయితే సుప్రీంకోర్టు వివాదాస్పద కోటా వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 93 శాతం మెరిట్ ఆధారంగా నియమించాలని, ఏడు శాతం మాత్రమే సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని తన ఆదేశాల్లో కోర్టు పేర్కొన్నది. నిరసనలు చేపడుతున్న విద్యార్థి నేతలు.. దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి పన్నలు కట్టబోమని, బిల్లలు చెల్లించబోమని వార్నింగ్ ఇచ్చారు.
ఆందోళన చేపడుతున్న విద్యార్థులను రజాకార్లతో పోల్చారు షేక్ హసీనా. 1971 యుద్ధ సమయంలో పాకిస్థాన్ మిలిటరీకి సహకరించిన వారిని రజాకార్లుగా పిలిచారు. ఆ పదాన్ని వాడడం పట్ల .. బంగ్లా నిరసనకారులు హసీనాపై ఆగ్రహంగా ఉన్నారు. కానీ ఆందోళనలు మిన్నంటడంతో ఆమె మాట మార్చారు. నిరసనకారులు ఉగ్రవాదులు కాదు అని ఆమె అన్నారు. విద్యార్థి నేతలతో శాంతి చర్చలకు ఆమె పిలుపునిచ్చారు. కానీ విద్యార్థి సంఘాలు ఆ చర్యలను బహిష్కరించాయి.
ఇవాళ మధ్యాహ్నం షేక్ హసీనా దేశం విడిచి వెళ్లారు. దేశం విడిచి వెళ్లిన కొన్ని గంటల్లోనే .. షేక్ హసీనా అధికారి నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఢాకాలో ఉన్న ఆమె ఇంట్లోకి వెళ్లిన నిరసనకారులు. గానాబభన్ ఇంటి నుంచి చైర్లు, సోఫాలను ఎత్తుకెళ్లారు.