హైదరాబాద్, నవంబర్ 24 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): భూమి, చంద్రుడి ఉద్భవానికి విశ్వంలో జరిగిన భారీ విస్ఫోటమే కారణమని ఇప్పటివరకూ చదువుకొన్నాం. 4.5 బిలియన్ సంవత్సరాల కిందట రెండు పెద్ద గ్రహాలు ప్రొటో ఎర్త్ (భూమి ఏర్పడటానికి ముందు గ్రహం), థియా పరస్పరం ఢీకొనడంతో ఇది జరిగినట్టు శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. అయితే, ఢీకొన్న అనంతరం చంద్రుడు, ప్రస్తుత భూమి ఏర్పడగా అంగారకుడి పరిమాణంలో ఉండే థియా ఏమైందన్న ప్రశ్నలకూ ఇంతవరకూ సమాధానం లేదు. అయితే, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టమ్ రిసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో పరిశోధకులు తాజాగా దీనిపై కొత్త థియరీని తెరమీదకు తీసుకొచ్చారు.
ప్రొటో ఎర్త్‌తో థియా ఢీకొన్న తర్వాత చంద్రుడు ఉద్భవించాడని, అనంతరం భూమిలోనే థియా కలిసిపోయిందని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. భూమితో పాటు చంద్రుడి గర్భంలో దొరికిన ఐసోటోప్‌లను విశ్లేషించగా ఇది తెలిసివచ్చినట్టు పేర్కొన్నారు. అంటే, ఒకరకంగా చంద్రుడిని పుట్టించిన థియా.. భూమిలో కలిసిపోయి మరణించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఈ థియరీపై మరింత లోతైన పరిశోధనలు చేయాల్సి ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు.