వనపర్తి, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ఓ గుట్ట సమీపంలోని మామిడి తోటలో అనార్యోగంతో ఉన్న ఓ పునుగు పిల్లి అస్వస్థతతో కనిపించింది. ఈ పరిస్థితిని గమనించిన కొం దరు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అసాధారణ పరిస్థితుల్లో కనిపించిన ఈ అరుదైన అటవీ జంతువు తారసపడటం తో ప్రజలు వింతగానే చూశారు. ఈ జంతువు పేరు వినడమే తప్పా ఈ ప్రాంతం లో కనిపించడం అరుదు. శ్రీరంగాపురం మండలం నాగరాల గుట్ట సమీపంలోని ఓ మామిడి తోటలో మంగళవారం ఉదయం పునుగు పిల్లి అనారోగ్యంతో గ్రామస్తులకు తారసపడింది.
కొత్త రకం జంతువు కావడం తో జనం సైతం ఆసక్తిగా గమనించారు. చా రల చాయతో ఉన్న పునుగు పిల్లిని చూసిన వారికి కొంత భయం.. భయంగానే కనిపించింది. కొత్త రకం జంతువుతో మనకెందుకు సమస్య అనుకున్న ప్రజలు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో పునుగు పిల్లి ఉన్న ప్రదేశానికి ఆలస్యంగా చేరుకున్న అటవీ సిబ్బంది వనపర్తికి సాయంత్రం తరలించారు.అనారోగ్యంతో ఉండటం.. ముఖం పై స్వల్ప గాయం, నోటి ద్వారా జొల్లు కారడంలాంటివి కనిపించడంతో జిల్లా కేంద్రంలోని పశువైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
వెటర్నరీ ఏడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్ మక్సూద్ అలీ, వేదవతి, సజీవలు పరిశీలన చేసి అరుదైన జంతువుకు చికిత్స అం దించగా హుషారుగా కనిపించింది. అయితే.. మరో రెండు, మూడు రోజులు చికిత్స అం దించాలని వైద్యులు సూచించగా అటవీ కార్యాలయానికి తరలించారు. కాగా, చికిత్స తీసుకుని అటవీ కార్యాలయానికి చేరుకున్న రెండు గంటల అనంతరం పునుగు పిల్లి రక్తం కక్కి మృతి చెందింది. అయితే అస్వస్థతకు గురైన సమాచారాన్ని ఉదయం తెలియపరిస్తే… తీరిగ్గా అటవీశాఖ అధికారులు సా యంత్రం ఆలస్యంగా చికిత్స కోసం తరలించడం వల్లే పునుగు పిల్లి చనిపోయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నాగరాల గుట్ట పరిదిలో అరుదుగా కనిపించిన ఈ పునుగు పిల్లి అధికంగా దట్టమైన అడవుల్లో ఉంటుంద ని, దీని గ్రంథుల ద్వారా సుగంధ ద్రవ్యం వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒంటిపై మచ్చలుండి నలుపు రంగులో కనిపిస్తున్న ఈ పునుగు పిల్లి వయస్సు ఏడాది ఉంటుందని, ఇది ఒకే జంతువు ఉండే అవకాశం ఉండదని, మరికొన్ని ఈ జాతికి సంబంధించిన జంతువులు ఉండే అవకాశం ఉందని వెటర్నరీ వైద్యులు భావిస్తున్నారు.