Mahesh Babu | టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం శుభాకాంక్షలతో హోరెత్తుతోంది. ఆగస్టు 9న మహేశ్‌బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు ప్రత్యేకంగా విషెస్ చెబుతున్నారు. మహేశ్ సినీ ప్రయాణం, సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ పలువురు స్టార్ హీరోలు ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మహేశ్‌బాబుకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ ఎదుగుదలను ఎన్నో ఏళ్లుగా చూస్తూ రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని చిరంజీవి పేర్కొన్నారు.
భారతీయ సినిమాలో అత్యంత ప్రేమాభిమానాలు పొందుతున్న ప్రముఖ నటుల్లో ఒకరిగా మహేశ్ ఎదగడం గర్వంగా ఉందని అన్నారు. భగవంతుడు ఎల్లప్పుడూ మహేశ్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు. మరోవైపు మహేశ్‌బాబుకు శుభాకాంక్షలు చెబుతూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా ప్రత్యేక సందేశాన్ని పంచుకుంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం, మరెన్నో విజయాలు దక్కాలని ఆకాంక్షించింది. ముఖ్యంగా మహేశ్‌బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రశంసించారు. చిన్నారులకు సహాయం చేయడంలో ఆయన చూపిస్తున్న నిబద్ధత, మానవతా దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు
విక్టరీ వెంకటేష్ కూడా తనదైన శైలిలో మహేశ్‌బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా చిన్నోడు మహేష్’ అంటూ ఆప్యాయంగా సంబోధించిన వెంకటేష్.. మహేశ్ జీవితంలో ఎల్లప్పుడూ ప్రేమ, నవ్వులు నిండాలని ఆకాంక్షించారు. అంతేకాదు, మహేశ్ నటిస్తున్న ‘వారణాసి’పై కూడా వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో రుద్ర పాత్రలో మహేశ్ రగ్గడ్‌గా, హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడని ప్రశంసించారు. వచ్చే ఏడాది ‘వారణాసి’తో మహేశ్ ప్రపంచాన్ని ఏలబోతున్నాడని పేర్కొంటూ.. ఆ సినిమాను చూసేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. మహేశ్‌బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మహేశ్ లుక్స్ ఇప్పటికే అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. రుద్ర పాత్రలో మహేశ్ కనిపించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కూడా భారీ ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. థియేటర్లలో ఆయన పాత సినిమాల రీ-రిలీజ్లు, ప్రత్యేక కార్యక్రమాలు, సోషల్ మీడియాలో ట్రెండ్స్‌తో సూపర్‌స్టార్ బర్త్‌డేను ఘనంగా జరుపుకుంటున్నారు.