Typhoon Dolphin : పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) లో ఏర్పడిన అత్యంత తీవ్రమైన ‘డాల్ఫిన్ (Dolphin)’ టైఫూన్ చైనా తూర్పు తీరాన్ని అతలాకుతలం చేస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులతో దూసుకొస్తున్న ఈ తుపాను దెబ్బకు దేశ వాణిజ్య రాజధాని షాంఘై (Shanghai) సహా పలు ప్రధాన నగరాలు స్తంభించిపోయాయి. చైనా ప్రభుత్వం ఇప్పటికే బ్లూ అలర్ట్ (Blue Alert) జారీ చేసింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
తుపాను ప్రభావం షాంఘై, జెజియాంగ్, ఫుజియాన్ ప్రావిన్సులపై తీవ్రంగా పడింది. ముందుజాగ్రత్త చర్యగా షాంఘైలోని హాంకియావో, పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం నాటికి 1,300 కు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇది మొత్తం రాకపోకల్లో 60 శాతానికి సమానం. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జెజియాంగ్, షాంఘై ఓడరేవులను పూర్తిగా ఖాళీ చేయించడంతోపాటు యాంగ్జీ నదీ పరివాహక ప్రాంతంలో నడిచే పలు రైళ్లు, పడవల సేవలను కూడా నిలిపివేశారు.
భారీ వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జెజియాంగ్ ప్రావిన్స్‌లోని తైజౌ నగరం, షాంఘై పరిసర లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 3.90 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతాల్లోని పాఠశాలలు, వ్యాపార సంస్థలు, పర్యాటక కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. చైనా తీరాన్ని తాకడానికి ముందే ఈ డాల్ఫిన్ తుపాను జపాన్‌లోని ఒకినావా దీవులు, తైవాన్ ఉత్తర ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో బీభత్సం సృష్టించింది.
రానున్న రోజుల్లో ప్రభావిత ప్రాంతాల్లో 200 నుంచి 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఈ దశాబ్దంలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన తుపానుల్లో ఒకటిగా పరిణమించే ప్రమాదం ఉందని చైనా వాతావరణ కేంద్రం హెచ్చరించింది.