Body Clock | మన శరీరంలో నిద్ర, మెళకువ సమయాలను మాత్రమే కాకుండా హార్మోన్ల విడుదల, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక స్థితి వంటి అనేక అంశాలను నియంత్రించే అంతర్గత జీవ గడియారం ఉంటుంది. మెదడులోని చిన్న భాగం వెలుతురు, చీకటి సమాచారాన్ని గుర్తించి శరీర రోజువారీ కార్యకలాపాలను ఒక క్రమంలో నడిపిస్తుంది. ఈ సహజ రిథమ్ క్రమం తప్పితే దాని ప్రభావం కేవలం నిద్రపైనే కాకుండా మెదడు పనితీరుపైనా పడుతుంది. నిద్ర వేళలు తరచూ మారడం, రాత్రివేళల్లో ఫోన్ చూడడం, రాత్రి షిఫ్టుల్లో పనిచేయడం, సుదీర్ఘ ప్రయాణాలు చేయడం వంటి కారణాలు శరీర జీవ గడియారాన్ని గాడి తప్పిస్తాయి.
జీవ గడియారం సరిగ్గా పనిచేయకపోతే ముందుగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం కనిపిస్తుంది. ఎంతసేపు నిద్రపోయినా మెదడుపై మబ్బులా అనిపించడం, సాధారణంగా గుర్తుండే విషయాలను మర్చిపోవడం, పనిపై దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనితోపాటు చిరాకు, ఆందోళన, మానసికంగా ఉత్సాహం తగ్గడం వంటి మార్పులు కూడా కనిపిస్తాయి. శరీర జీవ గడియారం దెబ్బతినడం వల్ల భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగాల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంగా నిద్రకు అంతరాయం కలిగితే భవిష్యత్తులో జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది.
జీవ గడియారాన్ని సరిచేసుకోవడానికి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవడం ముఖ్యమైన అలవాటుగా పేర్కొంటున్నారు. వారాంతాల్లో కూడా ఎక్కువసేపు నిద్రపోయి సమయాన్ని మార్చకుండా ఒకే విధమైన షెడ్యూల్ను పాటించడం ఉపయోగకరంగా ఉంటుంది. నిద్రలేచిన తర్వాత కొద్దిసేపు సహజమైన సూర్యకాంతిలో ఉండడం శరీర గడియారానికి రోజును గుర్తించేందుకు సహాయపడుతుంది. రాత్రి సమయంలో కాంతిని తగ్గించడం, పడుకునే ముందు తెరలను చూడడం తగ్గించడం, కెఫీన్ను రోజులో ముందుగానే తీసుకోవడం, భోజన సమయాలను సాధ్యమైనంత వరకు ఒకే విధంగా ఉంచడం, బయట కొంత శారీరక చురుకుదనం ఉండేలా చూసుకోవడం వంటివిఎంతగానో ఉపయోగపడతాయి.
ప్రస్తుతం నిద్ర కోసం మెగ్నిషియం కలిగిన పాదాల క్రీములు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, జీవ గడియారాన్ని క్రమబద్ధం చేసుకోవడంపైనే దృష్టి సారించాలి. నిద్ర, మెళకువ సమయాలను క్రమంలోకి తీసుకురావడం, వెలుతురు-చీకటి సహజ చక్రానికి అనుగుణంగా జీవించడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు. ఈ మార్పులు చేసినప్పటికీ ఏకాగ్రత తగ్గడం, మానసిక స్థితి సరిగా లేకపోవడం లేదా నిద్రపోయినా అలసట కొనసాగడం వంటి సమస్యలు ఉంటే వాటిని సాధారణ అలసటగా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం అవసరం. ఇలాంటి లక్షణాలు నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలకు సంకేతం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.