వైరాటౌన్, నవంబర్ 24: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామమైన ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని స్నానాల లక్ష్మీపురంలో వైరా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పిల్లర్ కడుతుండగానే కూలిపోయిన ఘటన సోమవారం చోటుచేసుకున్నది. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం-కేజీ సిరిపురం మధ్యలో వైరా నది పై రూ.10 కోట్లతో 12 పిల్లర్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కాంట్రాక్టర్ ఒక్కో పిల్లర్ నిర్మిస్తుండగా.. వాటి నాణ్యతా ప్రమాణాలపై ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా .. వారు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బ్రిడ్జి కట్టకముందే పిల్లర్లు కూలిపోతుంటే.. ఇక పూర్తయిన తర్వాత జరగకూడని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భూమి నాణ్యతను, పటుత్వాన్ని పరిశీలించకుండానే నిర్మాణాలు చేపడితే ఇలాగే ఉంటుందని గ్రామస్థులు ఆరోపించారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి పిల్లర్ల పటుత్వాన్ని పరిశీలించి, నాణ్యతగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్అండ్బీ డీఈ రమేశ్‌ను వివరణ కోరగా.. నూతనంగా నిర్మిస్తున్న వంతెన కోసం మట్టి తోడుతుండగా వైరాసిరిపురం వెళ్లే మార్గంలో పిల్లర్ కూలిపోయిందని, దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నామని వివరించారు.