హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక భూములను మల్టి పుల్ జోన్లోకి (Multi Zone) మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన ‘హిల్ట్’ పాల సీపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫ్యాక్టరీలు హానికర రసాయన వ్యర్థాలను దశాబ్దాలపాటు కుమ్మరించిన భూములను జనా వాసాలుగా మారుస్తుండటంపై పర్యావరణ వేత్తలు, మేధా వుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ మహా నగర పరిధిలోని 22 పారిశ్రామికవాడల్లోని (Industrial Zone) 9292.53 ఎకరాల భూములను మల్టిపుల్ జోన్లుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీని అమలులోకి తెచ్చింది. 1980, 90 దశకంలో ఈ వా డల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వాలు కేవలం రిజిస్ట్రేషన్ ధరకు కొన్ని, నామమాత్రపు రేటుతో మరికొన్ని పరిశ్రమలకు కేటాయించాయి.
ఇందులో రసాయనాల వినియోగంతో కూడిన పరిశ్రమలే అత్యధికంగా ఉన్నాయి. అనేక పరిశ్రమలు ఉత్పత్తి లేకుండా ఏండ్ల తరబడిగా ఖాయిలా పడగా, మరికొన్ని కేటాయించిన భూముల్లో కొంతమేర పరిశ్రమలు ఏర్పాటు చేసి మిగిలిన భూముల్ని ఖాళీగా ఉంచాయి. కొన్ని పరిశ్రమలు మాత్రమే పూర్తిస్థాయిలో కేటాయించిన భూముల్లో ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిడి, అవినీతి కారణాలు అనేకం ఉన్నా కాలుష్య నియంత్రణ మండలి ప్రేక్షకపాత్రతో పరిశ్రమల్లోని రసాయన, ఇతర హానికర వ్యర్థాలు పరిశ్రమల్లో నుంచి చుట్టూ చేరడంతోపాటు నాలాలు, వాగులు, వంకలు, నదుల్ని కాలుష్య కాసారాలుగా మార్చాయి. ప్రధానంగా అనేక పరిశ్రమలు హానికర రసాయన వ్యర్థాలను పారబోసేందుకు అడ్డదారులు తొక్కాయి.
తమ క్యాంపస్ లోపలనే వందల ఫీట్లల్లో బోర్లు వేసి, పెద్ద పెద్ద గుంతలు తీసి వ్యర్థాలను వాటి ద్వారా భూగర్భంలోకి పంపిన దాఖలాలు అనేకం. దీంతో ఆ వ్యర్థాలు భూగర్భజలాల్లో కలిసి చుట్టూ పదుల కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు విస్తరించి భూగర్భజలాలు విషపూరితంగా మారాయి. ఇందుకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనే జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్జీఆర్ఐ), జాతీయ పర్యావరణ, ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ (నీరి), భారతీయ రసాయన సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) వంటి సంస్థలు పారిశ్రామికవాడల చుట్టూ పరిశోధనలు చేసి, భూగర్భజలాలను వినియోగించొద్దనే నివేదికలు సైతం ఇచ్చాయి. పర్యావరణవేత్తలు, బాధితులు సుప్రీం కోర్టు, ఎన్జీటీల్లో వందలాది కేసులు కూడా వేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి వచ్చిన ఆదేశాలను సైతం ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు అమలు చేసిన పాపాన పోలేదు. కాలక్రమేణా కొంతమేర జీరో డిశ్చార్జి విధానాలు, పటాన్చెరు, జీడిమెట్ల వంటి రసాయన వ్యర్థాల శుద్ధి కేంద్రాలు అందుబాటులోకి రావడంతో తీవ్రత తగ్గిందేగానీ ఇప్పటికీ మూసీ, నాలాల్లో రసాయన వ్యర్థాలు వస్తూనే ఉన్నాయి. ఒక్క హుస్సేన్‌సాగర్‌లోనే వందలాది హానికర భారలోహాలు ఉన్నట్లు గత అధ్యయనాల్లోనే తేలిందంటే పరిశ్రమల భూముల్లోని భూగర్భజలాల్లో తీవ్రత ఎలా ఉంటుందో ఊహించడానికి అంతుబట్టనిది.
లవ్ కెనాల్… హిల్ట్ వంటి విధానాలకో గుణపాఠం!
న్యూయార్క్‌లోని నయాగారా జలపాతం సమీపంలో నయాగారా కౌంటీ ప్రాంతం… అక్కడ 1954లో సెయింట్ స్కూల్ నిర్మాణం జరిగింది. ఆపై చుట్టూ నివాసాలు వచ్చాయి. అందమైన పాఠశాల భవనం… చుట్టూ ఇండ్ల నిర్మాణంతో ప్రజలు ఆదిలో ఆనందంగానే ఉన్నారు. కానీ 1970 ప్రాంతంలో అక్కడి ప్రజలు ప్రధానంగా విద్యార్థులు హఠాత్తుగా అనారోగ్యం బారిన పడుతున్నారు. విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి. అంతేకాదు… పాఠశాల, ఇండ్లు, భవనాల గోడలు, పునాదులు నెమ్మదిగా రంగు మారడం, దెబ్బతినడం కనిపించింది. దీంతో 1977లో పరిశోధకులు అక్కడ అధ్యయనం నిర్వహించగా… దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అక్కడ చౌకగా విద్యుత్ ఉత్పత్తి కోసం చేపట్టిన ప్రాజెక్టు కోసం కాల్వను తవ్వగా ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఆతర్వాత 1942 నుంచి 1953 వరకు హుకర్ ఎలక్ట్రో కెమికల్ కంపెనీ రసాయన వ్యర్థాలను పారబోసేందుకు కాల్వను వినియోగించుకుంది. పూర్తిగా కప్పేసి ఉన్న కాల్వ ప్రదేశాన్ని 1953లో ఒక విద్యా మండలి కొనుగోలు చేసి సెయింట్ స్కూల్‌ను నిర్మించింది.
ఆపై నివాస యోగ్యంగా మారింది. అయితే భూమి లోపల ఉన్న రసాయన, ఇతర హానికర వ్యర్థాలు భూగర్భజలాల ద్వారా బయటికి రావడంతో పాటు భూమి పొరల్లో నుంచి పునాదులు, గోడల ద్వారా బయటికి లీకు కావడంతో అక్కడ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. 248 ప్రమాదకర వ్యర్థాలు నీళ్లు, ఇళ్ల భవనాల్లోకి చేరడం, వీటిలో 30 రసాయనాలు గర్భస్థ పిండాల ప్రాణాలు తీసే పీటోటాక్సిన్లుగా గుర్తించారు. మరో 18 రసాయన వ్యర్థాలు పిండం ఎదుగుదలను దెబ్బతీసేవిగా అధ్యయనాల్లో తేలింది. మరో 34 క్యాన్సర్ కాలకాలు ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. 1978లో న్యూయార్క్ ప్రభుత్వం చేపట్టిన అధ్యయనంలో అక్కడి మహిళల్లో గర్భస్రావాలు అధికంగా ఉన్నట్లు తేలింది. దీంతో వెంటనే అక్కడ వైద్యపరమైన అత్యవసర స్థితిని ప్రకటించారు. పాఠశాలను మూసివేసి, జనాన్ని అక్కడి నుంచి తరలించారు. చివరకు ఈ ప్రాంతం చుట్టూ ఉన్న కాలనీల్లోనూ ప్రజల ఆరోగ్యం దెబ్బతినడాన్ని 1980ల్లో జరిగిన అధ్యయనాల్లో గుర్తించారు. లవ్ కెనాల్ ప్రాంతంలో శిశువుల బరువు ఇతర ప్రాంతాల్లో కంటే 2.3 రెట్లు తక్కువగా తేలింది. 12.1 శాతం మంది శిశువులు అవలక్షణాలతో జన్మించినట్లు గుర్తించారు. ఇతర ప్రాంతాల్లో కంటే ఇక్కడి వారిలో 2.5 శాతం ఎక్కువ మందికి మూర్ఛ, ఒకటిన్నర శాతం ఎక్కువలో మందబుద్ది ఉందని సర్వేలు తేల్చాయి. మగవారిలో 70 శాతం ఎక్కువగా లంగ్ క్యాన్సర్ ఉంటే మహిళల్లో అది వంద శాతంగా అధ్యయనాలు స్పష్టం చేశాయి.
కండ్ల ముందే కాలుష్య కాసారాలు
ఒక గ్రామంలో జన్యుసంబంధ వ్యాధులతో బ్లూబేబీ (రక్తంలో ఆక్సీజన్ అనేదే లేకపోవడం వల్ల నీలి రంగు చర్మంతో జన్మించే శిశువు) పుట్టింది. మరో గ్రామంలో అసలు కనుగుడ్లు లేకుండానే శిశువు జన్మించింది. ఇంకో గ్రామంలో నడి వయసున్న మహిళల్లో ప్రతి పది మందిలో ఆరుగురు తీవ్ర రక్తస్రావంతో గర్భాశయ వ్యాధులతో బాధపడుతున్నారని తేలింది. ఒక కాలనీలో ప్రభుత్వం వేసిన బోరు నుంచి రసాయనాలతో కూడిన నీళ్లు వచ్చాయి. ఒకనాడు మెతుకు సీమలో సిరులు పండించిన నక్కవాగు కాలుష్య కాసారం కావడంతో దానిని పరీక్షించిన నిపుణులు ‘డెత్ రివర్ (మృత నది)’గా నామకరణం చేశారు. ఇవన్నీ ఎక్కడో జరిగిన ఘోరాలు కాదు! హైదరాబాద్ మహా నగరంలోని పారిశ్రామికవాడల్లో దశాబ్దాల తరబడి నిర్లక్ష్య యాజమాన్యాల పాపానికి మన కండ్ల ముందే మనలోని కొందరు అమాయక ప్రజలు చెల్లించిన మూల్యం. అలాంటిది ఏండ్ల తరబడి ఆ పరిశ్రమలు నడిచిన ప్రాంతాల్లోనే అపార్టుమెంట్లు వెలిసి లక్షలాది మంది అందులో నివసిస్తే వారి పరిస్థితేంది? దశాబ్దాల తరబడి వ్యర్థాలు పారిన భూముల్లోనే పాఠశాలలు నిర్మిస్తే అక్కడ చదివే చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తుకు పూచీ ఎవరు? వందల ఫీట్లల్లో బోర్లు వేసి రాత్రికి రాత్రి టన్నులకొద్దీ హానికర రసాయన వ్యర్థాలను అందులోకి పంపి పుడమిని విష తుల్యం చేసిన ఆ పరిశ్రమల భూముల్లో హోటళ్లు నిర్మించి భూగర్భజలాలను వినియోగిస్తే ముంచుకొచ్చే ఉపద్రవానికి బాధ్యత వహించేదెవరు?
కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక భూముల్లో కాసుల వేట కోసం తెరపైకి తెచ్చిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ)’పై వ్యక్తమవుతున్న ఆందోళన ఇది. కొందరు ప్రభుత్వ పెద్దలు… మరికొందరు పారిశ్రామికవేత్తల ధన దాహం… వెరసి కనీస శాస్త్రీయ అధ్యయనం, దశాబ్దాలుగా విష రసాయనాలతో మగ్గిపోతున్న భూముల్లో కించిత్తు పరీక్షలు లేకుండానే అమలులోకి వచ్చిన హిల్ట్ పాలసీ మున్ముందు ప్రజారోగ్యానికి పెను ముప్పుగా పరిణమించనుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల భూములను మల్టిపుల్ జోన్లుగా మార్చి టౌన్‌షిప్‌లు, హోటళ్లు, స్కూళ్లు, అపార్టుమెంట్లు, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాలను నిర్మించి జనావాసాలుగా మార్చడమంటే కాలుష్య భూతంతో డేంజర్ గేమ్ ఆడటమేనని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. మానవ తప్పిదాలతో జరిగిన విపత్తులు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన దాఖలాలు ఉన్నాయని, వాటితో గుణపాఠాలు నేర్చుకోకుండా పెనం మీద ఉన్న ప్రజారోగ్యాన్ని పొయ్యిలోకి నెట్టడమేందని ప్రశ్నిస్తున్నారు. హిల్ట్‌తో కాలుష్య చెలగాటమే..!
పారిశ్రామికవాడల నుంచి వెలువడే ద్రవ, రసాయన, వాయు కాలుష్య కారకాల ద్వారా చుట్టూ ఉండే నివాస ప్రాంతాలకు ముప్పు ఉన్నందున పరిశ్రమల్ని అవుటర్ రింగు రోడ్డు అవతల జనావాసాలు లేనిచోట్లకు తరలించాలని 2013లోనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చినా పూర్తిస్థాయిలో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ సాకు చూపి అగ్గువకు మల్టీపుల్ జోన్లుగా మారుస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. వాస్తవానికి పరిశ్రమల చుట్టూ పదుల కిలోమీటర్లలోని భూగర్భజలాలే విష తుల్యంగా మారాయని గత అధ్యయనాలు చెబుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా పరిశ్రమల భూముల్లోనే జనారణ్యాలుగా మార్చేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ పెద్దలు కొందరు భూములపై కన్నేయడం, ఖాయిలాపడిన పరిశ్రమల భూముల్ని చవకగా కొట్టేసేందుకు హిల్ట్‌ను తెరపైకి తెచ్చారనే ఆరోపణలు ఎలా ఉన్నా… ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న ఈ పాలసీని కనీస అధ్యయనం లేకుండా అమలు చేస్తున్నది. పారిశ్రామికవాడల్లోని భూముల్లో గత 30-40 ఏండ్లుగా విష రసాయనాలు పారడం, భారలోహాలు భూమిలో కలవడమనేది మన కండ్ల ముందే జరిగిన దుష్ఫరిణామాలు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ భూముల్లో నిర్మాణాలు… అందునా జనావాసాలకు అనుమతి ఇచ్చే ముందు అసలు ఆ భూములు అందుకు వినియోగించడం శ్రేయస్కరమేనా? అని కనీస పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది. హిల్ట్ అమలుతో ప్రభుత్వం ఆయా భూములను మల్టీపుల్ జోన్లుగా మార్చిన తర్వాత అక్కడ అపార్టుమెంట్లు, హోటళ్లు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ వంటి సముదాయాలు వస్తాయి. వీటన్నింటికీ కావాల్సిన నీటి వినియోగం జలమండలి ద్వారా సాధ్యపడదు. చివరకు నిర్మాణ సమయంలోనైనా భూగర్భజలాలు కావాల్సిందే. ఈ క్రమంలో భారీ నిర్మాణాల కోసం వందలు, వేల ఫీట్ల లోతుల్లో బోర్లు వేసి జలాలను తోడేస్తారు. సెల్లార్ల కోసం భూమి లోపల మీటర్ల కొద్దీ తవ్వకాలు జరుపుతారు.
తద్వారా భూగర్భంలోని కాలుష్య జడలు విప్పి ప్రభావాన్ని చూపడం మొదలుపెడుతుంది. ఆపై అక్కడ వివిధ రూపాల్లో జరిగే భూగర్భజలాల వినియోగం ప్రజారోగ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తుంది. అంటే ఇప్పుడు భూమి లోపల నిక్షిప్తమై.. నిద్రపోతున్న కాలుష్య భూతాన్ని తట్టి లేపినట్లేనని ఒక పర్యావరణవేత్త స్పష్టం చేశారు. కారు చవకగా భూములు మల్టీపుల్ జోన్లుగా మారడం… ప్రభుత్వ పెద్దలు, పరిశ్రమల యజమానులు ఎవరి లాభం వారు చూసుకొని నివాస, వాణిజ్య, వ్యాపార సముదాయాలు నిర్మించి చేతులు దులుపుకుంటారు. కానీ భవిష్యత్తులో అక్కడ ఉండే జనం, అక్కడి భూగర్భజలాలను వాడే వినియోగదారులు ఆ కాలుష్య భూతానికి విలవిలలాడాల్సిందేనని పలువురు హెచ్చరిస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి ప్రజారోగ్యంపట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ పరిశ్రమల భూముల్లో భారీ ఎత్తున చెట్ల పెంపకంతో పచ్చని వనాలుగా మార్చి దశాబ్దాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. తద్వారా కాంక్రీట్ జంగిల్లో లంగ్ స్పేస్ విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది.