హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థలు ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున కరెంట్‌ను కొనుగోళ్లు చేయనున్నాయి. అధికారిక సమాచారం మేరకు ఐదువేల మెగావాట్ల సోలార్ విద్యుత్తును కొనుగోలు చేయనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు మంగళవారం(నేడు) జరిగే క్యాబినెట్ సమావేశం ముందుకు రానున్నాయి. క్యాబినెట్ ఆమోదం లాంఛనంగానే కనిపిస్తున్నది. ఆ తర్వాత ఓపెన్ బిడ్డింగ్ పద్ధతిలో సోలార్ విద్యుత్తును కొనుగోలుచేస్తారు. రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. గ్రీన్ ఎనర్జీ పాలసీని కూడా ప్రకటించింది. ఈ తరుణంలో కొత్త సోలార్ విద్యుత్తు కొనుగోళ్లు ఎందుకు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ విద్యుత్తు కొంటే నాన్‌పీక్ అవర్స్‌లో థర్మల్ప్లాంట్లను బ్యాక్‌డౌన్ చేయాల్సి వస్తుంది. కొన్న విద్యుత్తును వాడుకోకపోతే ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఇదంతా భారమవుతుందని విద్యుత్తురంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.