న్యూఢిల్లీ, మార్చి 3 : ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత భారత్ ఎట్టకేలకు స్పందించింది. గల్ఫ్ ప్రాంతమంతా డ్రోన్లు, క్షిపణి దాడులతో దద్దరిల్లుతున్న వేళ మంగళవారం భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది. రోజురోజుకు పెరుగుతున్న యుద్ధ తీవ్రత ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిని మాత్రం భారత్ ఇంతవరకు ఖండించలేదు. దౌత్య మార్గాల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలని ఒక మొక్కుబడి ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంది.
‘యుద్ధం తీవ్రమవ్వడమే కాక, అది మిగతా దేశాలకు కూడా వ్యాపించడాన్ని మేం గమనించాం. ఈ విధ్వంసంలో మరణాల సంఖ్య పెరుగుతున్నది. సాధారణ జీవితం, ఆర్థిక కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. ఈ ప్రాంతం భద్రత, స్థిరత్వంలో కీలకమైన వాటాలు కలిగిన పొరుగు దేశంగా, ఈ పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ యుద్ధం కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయు పౌరుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. భారత వాణిజ్య నౌకలపై దాడులను తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది.
అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై యుద్ధంతో విరుచుకుపడుతున్నా భారత్ ఇన్నాళ్లు మౌనంగా ఉండటం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. యుద్ధం తీవ్రమవుతున్నా భారత్ నోరు మెదకపోవడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే అధికారిక ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.