హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటున్న మహిళలకు ప్రత్యేకంగా ఐడీ కార్డులు ఇవ్వాలని ఐఎన్టీయూసీ నేతలు సూచించారు. సర్వీసులో ఉన్న కార్మికులు, రిటైర్డ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు సోమవారం బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ సర్వీసులో ఉన్న వారికి 2021 వేతన సవరణ, ఉద్యోగ భద్రత, పని భారం తగ్గింపు, రిటైరైన వారికి 2017 వేతన సవరణ తర్వాతి గ్రాట్యుటీ డిఫరెన్స్ డబ్బులు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డిఫరెన్స్ డబ్బులు, ఏప్రిల్ 2024 నుంచి రిటైరైన వారికి టెర్మినల్ బెనిఫిట్స్ డబ్బులు చెల్లించాలని కోరారు. ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్, బీబీయూ మియాపూర్‌ను కరీంనగర్ షిఫ్ట్ చేయాలనే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై దాడులను అరికట్టాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తానని ఎండీ నాగిరెడ్డి హామీ ఇచ్చారు.