Tea Coffee : పొరుగునున్న కర్ణాటక రాష్ట్రం (Karnataka state) లో పాలు (Milk), కాఫీ (Coffee), టీ (Tea) ల అమ్మకాలు (Sales) నిలిచిపోయాయి. జీఎస్టీ అధికారులు తమకు నోటీసుల ఇవ్వడాన్ని నిరసిస్తూ చిరు వ్యాపారులు తమ బేకరీలు, చాయ్ దుకాణాల్లో టీ, కాఫీ, పాల అమ్మకాలను నిలిపివేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. నిరసనలో భాగంగా కేవలం బ్లాక్ టీ (Black tea), బ్లాక్ కాఫీ (Black coffee) మాత్రమే అమ్ముతున్నారు.
ఇప్పటికే చాలామంది స్మాల్ ట్రేడర్స్ యూపీఐ చెల్లింపులను కూడా నిలిపివేశారు. కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తున్నారు. జీఎస్టీ అధికారులు తమను లక్ష్యంగా చేసుకుని నోటీసులు పంపిస్తున్నారంటూ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీఎస్టీ అధికారులు తమకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం దిగొచ్చింది. చిరు వ్యాపారులకు సంబంధించిన ప్రతినిధులను చర్చలకు పిలిచింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం సిద్ధరామయ్య తన ఇంట్లోనే స్మాల్ ట్రేడర్స్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమై, జీఎస్టీ నోటీసులను వెనక్కి తీసుకోకపోతే ఈ నెల 25న రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహిస్తామని చిరువ్యాపారులు హెచ్చరించారు.
కాగా 2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య జరిగిన యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ ఆధారంగా జీఎస్టీ విభాగం స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఆ డ్రైవ్లో భాగంగా సేవల విభాగంలో ఆన్లైన్ పేమెంట్స్ విలువ రూ.20 లక్షలలు దాటితే, వస్తువుల విభాగంలో పేమెంట్స్ రూ.40 లక్షలు దాటితే అధికారులు చిరువ్యాపారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దాంతో స్మాల్ ట్రేడర్స్ అంతా ఒక్కటై నిరసన చేస్తున్నారు.