Nitish Kumar : బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar), ఆర్జేడీ అగ్రనేత (RJD top leader), ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తేజస్వియాదవ్ (Tejashwi Yadav) మధ్య అసెంబ్లీ (Assembly) లో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీహార్ ఓటర్ల జాబితాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు వ్యతిరేకంగా తేజస్వియాదవ్ తన గళం వినిపించారు. కానీ ఎస్ఐఆర్ను సమర్థిస్తూ సీఎం నితీశ్ వాగ్వాదానికి దిగారు. ఓ సందర్భంలో నితీశ్ కుమార్ ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘నువ్వొక బచ్చాగాడివి, నీకేం తెలుసు..?’ అని తేజస్విపై మండిపడ్డారు.
ముందుగా తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. ‘నేను కేవలం ఒక నాలుగు విషయాలు అడుగుతా. ఓటర్ లిస్టును గత ఫిబ్రవరిలో ఒకసారి ప్రచురించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రివిజన్ జరగాల్సింది. కానీ అందుకు బదులుగా అసెంబ్లీ ఎన్నికలవేళ ఇప్పుడు రివిజన్ చేస్తున్నారు. ఓటర్ జాబితాలో పేరు నమోదు కోసం 11 రకాల డాక్యుమెంట్లు అడుగుతున్నారు. పేదలు, నిరక్షరాష్యులకు ఆ 11 రకాల డాక్యుమెంట్లను కేవలం 25 రోజుల్లో సిద్ధం చేసుకోవడం సాధ్యమా..? ఇది పేదలకు, నిరక్షరాష్యులకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్థికభారంగా మారింది. ఎన్నికల సంఘం తీరుతో పేదలు ఎన్నికలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఓటు అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఆ హక్కును ఈసీ పేదలకు దూరం చేస్తోంది.’ అని విమర్శించారు.
దాంతో ఆగ్రహించిన సీఎం తేజస్విపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘నువ్వేం మాట్లాడుతున్నావ్. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్. నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులిద్దరూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో నీకు తెలుసా..? మీరు మంచిగా పని చేయడంలేదనే మేం దూరం జరిగాం. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఏం చేయాలో ప్రజలు తేల్చుకుంటారు. మా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. ఇలాంటి వాళ్లు (తేజస్వియాదవ్‌ను ఉద్దేశించి) ఓట్ల కోసం ఏదైనా మాట్లాడుతారు. మీ హయాంలో మహిళలకు ఏమైనా మేలు జరిగిందా..? మేం మహిళల కోసం ఎంతో చేశాం. ముస్లింల కోసం ఆర్జేడీ చేసిందేమీ లేదు. మేం ముస్లింల క్షేమం కోసం పనిచేస్తున్నాం. నువ్వు కేవలం ఒక బచ్చాగాడివి, నీకేం తెలుసు..? ఆర్జేడీ హయాంలో సాయంత్రం అయితే పట్నాలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడేవారు. మేం చేసిన అభివృద్ధి పనులతో ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తాం.’ అని నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
కాగా బీహార్‌లో ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై పార్లమెంట్లో కూడా గత మూడు రోజులుగా రభస జరుగుతోంది. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో ఉభయసభలు ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా పడుతున్నాయి.